ఆఫీసులో నిద్ర వస్తుందా?.. ఐతే ఇలా చేయాల్సిందే!

Mana Enadu : ఉదయాన్నే ఆఫీసుకు వెళ్తాం. బ్రేక్ ఫాస్ట్ చేసిన కాసేపటికే నిద్ర ముంచుకొస్తుంది. అలా వెళ్లి ఓ టీ తాగేసి వస్తాం. ఆ తర్వాత మరో గంటకు ఆవలించేస్తుంటాం. ఇక మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత వచ్చే కునుకు ఆపుకోవడం కాస్త కష్టమే. ఈ నిద్ర(Sleep) వల్ల పని మీద శ్రద్ధ పెట్టలేం. ఇలా ఆఫీసులో నిద్ర రావడం అనే సమస్య చాలా మందికి ఉంది. అసలు ఈ సమస్య తలెత్తడానికి కారణమేంటి..?

రాత్రి ఆలస్యంగా భోజనం చేస్తున్నారా?

రాత్రి భోజనం ఆలస్యంగా చేయడం వల్ల నిద్ర కూడా ఆలస్యంగా పోతారు. మళ్లీ ఉదయాన్నే లేస్తారు. దీనివల్ల నిద్ర పోవాల్సిన సమయం తగ్గి ఆఫీసులో నిద్ర వస్తుంది. అందుకే రాత్రి భోజనం వీలైనంత త్వరగా 7 నుంచి 8 గంటల లోపు చేయాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. 

పడుకునే ముందు నో మొబైల్ 

ఇక ప్రజెంట్ జనరేషన్ చేతిలో ఫోన్ లేనిదే కనీసం తిండి కూడా తినడం లేదు. ఇక పడుకోవడానికి బెడ్ ఎక్కిన వెంటనే మొబైల్ ఫోన్ చేతిలో పట్టుకుని బ్రౌజింగ్ షురూ చేస్తారు. అలా ఎప్పుడో 10 గంటలకు పడుకోవాలని అనుకుని రాత్రి ఒంటి గంట వరకు ఫోన్ యూజ్ చేస్తూనే ఉంటారు. ఇలా తక్కువ వెలుతురులో మొబైల్ వాడకం వల్ల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుందని నిపుణులు చెబుతున్నారు. అందుకే పడుకునే గంట ముందు ఎలక్ట్రానిక్ పరికాలను దూరంగా ఉంచాలని సూచించారు.

నో ఆల్కహాల్.. నో టీ కాఫీ

చాలా మంది పడుకునే ముందు ఓ చుక్కేస్తే అన్నీ మరిచిపోయి హాయిగా నిద్రపోవచ్చని అనుకుంటారు. కానీ  ఆల్కహాల్‌ తాగడం వల్ల నిద్రలేమితో శరీర ఆరోగ్యవ్యవస్థ మీద ప్రభావం పడుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇక రాత్రి సమయంలో కాఫీ, టీలు తాగడం వల్ల నిద్ర దూరం అయిపోతుందని పలు పరిశోధనలు తెలిపాయి. 

హాయిగా నిద్రపోవాలంటే?

ఇక హాయిగా నిద్రపోవాలంటే రాత్రి పడుకునే ముందు పుస్తకం చదవటం అలవాటు చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇంకోవైపు పసుపు కలిపిన పాలను నిద్రపోయే ముందు తాగితే హాయిగా పడుకోవచ్చని చెబుతున్నారు. రోజుకు కచ్చితంగా 6 నుంచి 8 గంటల సమయం వరకూ నిద్రపోవాలని.. అలా చేస్తేనే మరుసటి రోజు అలసట, నీరసం, చిరాకు దరి చేరవని అంటున్నారు. సరిపడా నిద్ర ఉంటేనే రోజంతా ఉత్సాహంగా ఉండగలుగుతారని నిపుణులు చెబుతున్నారు.

Share post:

లేటెస్ట్