‘బిష్ణోయ్‌ తెగకు సల్మాన్ ఖాన్ క్షమాపణ చెప్పాలి’

Mana Enadu : బాలీవుడ్‌ స్టార్‌ హీరో సల్మాన్‌ఖాన్‌ (Salman Khan)కు గ్యాంగ్‌స్టర్‌ లారెన్స్‌ బిష్ణోయ్‌ నుంచి తరచూ బెదిరింపులు వస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల సల్మాన్‌ సన్నిహితుడు, ఎన్సీపీ నేత బాబా సిద్దిఖీని ఈ గ్యాంగ్ దారుణంగా హతమార్చింది. ఈ నేపథ్యంలో మళ్లీ లారెన్స్ బిష్ణోయ్ పేరు తెరపైకి వచ్చింది. ఈ నేపథ్యంలో బిష్ణోయ్‌ తెగకు బహిరంగ క్షమాపణలు చెప్తే సల్మాన్ ఖాన్ కు ప్రమాదం తప్పే అవకాశం ఉందని రైతు నాయకుడు రాకేశ్‌ టికాయత్‌(Rakesj Tikait) అన్నారు. 

ఆయన క్షమాపణ చెప్పాలి

‘‘బిష్ణోయ్ తెగ(Bishnoi Community)తో సల్మాన్‌ ఖాన్‌కు ఎప్పటి నుంచో వివాదం ఉంది. అయితే ఇది ఒక వ్యక్తి సమస్య కాదు. ఒక తెగ నమ్మకాలకు సంబంధించిన సమస్య. అందుకే సల్మాన్‌ ఇప్పటికైనా బిష్ణోయ్‌లకు సారీ చెప్పాలి. వారికి సంబంధించిన ఏదైనా ఆలయానికి వెళ్లి, గతంలో తాను చేసిన తప్పునకు బహిరంగంగా క్షమాపణలు అడగాలి. అలా చేస్తేనే వారిలో ఆయనపై ఉన్న కోపం పోతుంది.

ఆ గ్యాంగ్ చాలా దుర్మార్గమైనది

లేదంటే ఈ సమస్య మరింత పెద్దది అవుతుంది. లారెన్స్ గ్యాంగ్(Lawrence Bishnoi) చాలా దుర్మార్గమైనది. జైల్లో ఉండి ఇలాంటి దారుణాలకు ఒడిగడుతున్నారు. వారు ఎవరికి ఎప్పుడు ఏ రకంగా హాని తలపెడతారో తెలియదు. క్షమాపణ కోరితే విభేదాలు తొలగి ప్రశాంతంగా బతకొచ్చు. లేకపోతే సల్మాన్  ప్రాణాలకే ముప్పు.’’ అని టికాయత్‌ ఆందోళన వ్యక్తం చేశారు. 

సల్మాన్ కు బెదిరింపులు

ఇక కృష్ణ జింకలను వేటాడిన కేసు నేపథ్యంలో ఇప్పటికే పలుమార్లు లారెన్స్‌ బిష్ణోయ్‌ గ్యాంగ్‌ నుంచి సల్మాన్‌ఖాన్‌కు బెదిరింపులు వచ్చిన విషయం తెలిసిందే. ఈ ఏడాది ఏప్రిల్‌లో ఏకంగా బాంద్రాలోని గెలాక్సీ అపార్ట్‌మెంట్‌ వద్ద కాల్పులు జరిపారు. ఆ తర్వాత ఇటీవల ఎన్సీపీ నేత బాబా సిద్దీఖీ(Baba Siddique)ని దారుణంగా హతమార్చారు. దీంతో సల్మాన్‌ నివాసం వద్ద మహారాష్ట్ర ప్రభుత్వం భద్రతను పెంచింది. తాజాగా ఆయన బుల్లెట్‌ ప్రూఫ్‌ కారు సైతం కొనుగోలు చేశారు.

Share post:

లేటెస్ట్