Mana Enadu : మూగ జీవాల సంరక్షణ కోసం నటి రేణూ దేశాయ్ (Renu desai) ‘శ్రీ ఆద్య యానిమల్ షెల్టర్’ పేరుతో ఎన్జీవో ప్రారంభించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ సంస్థకు ఎవరైనా విరాళాలు ఇవ్వొచ్చంటూ ఓ పోస్టు పెట్టారు. తానొక అంబులెన్స్ కొనుగోలు చేసినట్లు పోస్టులో పేర్కొన్నారు. అయితే ఈ విషయంలో రామ్ చరణ్ సతీమణి ఉపాసన కొణిదెల తనకు చాలా సాయం చేశారంటూ తెలిపారు. చరణ్ పెంపుడు శునకం రైమీ పేరుతో విరాళం అందించినట్లు వెల్లడించారు.
థాంక్యూ రైమీ కొణిదెల
ఈ విషయాన్ని రేణూ దేశాయ్ తాజాగా ఇన్‌స్టా స్టోరీస్‌లో షేర్ చేసి.. ‘‘అంబులెన్స్ కొనేందుకు డొనేషన్ ఇచ్చిన రైమీ కొణిదెలకు ధన్యవాదాలు’’ అని రాసుకొచ్చారు. ఈ స్టోరీకి ఉపాసన కొణిదెలను ట్యాగ్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్టు నెట్టింట వైరల్ గా మారడంతో నెటిజన్లు స్పందిస్తున్నారు. రేణూ దేశాయ్, ఉపాసన చాలా మంచి మనుషులంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. టూ బ్యూటిఫుల్ లేడీస్ ఇన్ సైడ్ ఔట్ అంటూ కామెంట్లు పెడుతున్నారు.
మూగ జీవాల సంరక్షణ కోసం
ఇక రేణూ దేశాయ్ ఎన్నో ఏళ్ల నుంచి మూగజీవాల పరిరక్షణ కోసం పాటుపడుతున్న విషయం తెలిసిందే. వాటి సంరక్షణ కోసం ప్రతి ఒక్కరూ పాటుపడాలని ఆమె తరచూ విజ్ఞప్తులు చేస్తుంటారు కూడా. ఇక తన వంతుగా తన కుమార్తె ఆద్య పేరిట ఎన్జీవోను ప్రారంభించారు. మరోవైపు, రామ్ చరణ్ – ఉపాసన దంపతులకు కూడా మూగ జీవాలంటే ఇష్టమన్న విషయం తెలిసిందే. కుక్కలు, గుర్రాలను పెంచడమే గాక పులులు, ఎలుగుబంట్లు ఇతర జీవాలను దత్తత తీసుకుని వాటి సంరక్షణను చూస్తుంటారు ఈ దంపతులు.