గుడ్ న్యూస్.. దీపావళికి ‘ఇందిరమ్మ ఇండ్లు’

Mana Enadu : తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీ(Six Guarantees)ల్లో ఇందిరమ్మ ఇళ్లు ఒకటి. ఇప్పటికే ఈ పథకం అమలుపై ప్రత్యేక దృష్టి పెట్టిన రాష్ట్ర సర్కార్ తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. దీపావళి(Diwali) పర్వదిన కానుకగా ఇందిరమ్మ ఇళ్లను మొదటి విడతగా ప్రారంభించాలని నిర్ణయించింది. దీపావళి రోజు అమావాస్య కాబట్టి.. ఆ తర్వాత మంచిరోజు చూసుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ గృహాల నిర్మాణానికి శ్రీకారం చుట్టనున్నట్లు తెలిపింది.

దీపావళికి ముందే పేలనున్న బాంబు

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశం(Telangana Cabinet Meeting)లో నిర్ణయించిన విషయాలను  రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేసి వెల్లడించారు. ఈ నేపథ్యంలో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 3,500 ఇళ్ల చొప్పున ఇందిరమ్మ గృహాల(Indiramma Houses)ను నిర్మించనున్నాం. ఈనెల 31లోగా దీపావళి పండగకు ముందే.. నేను చెప్పిన బాంబు పేలుతుంది.  2020 నుంచి పెండింగులో ఉన్న ఐదు డీఏల్లో ఒకటి ఇవ్వాలని కేబినెట్‌ నిర్ణయం తీసుకుంది. అని తెలిపారు.

కేబినెట్ తీసుకున్న మరికొన్ని నిర్ణయాలు

317 జీవో, 46 జీవోలపై సబ్‌ కమిటీ ఇచ్చిన నివేదికపై చర్చించిన కేబినెట్ సుదూర ప్రాంతాల్లో ఉన్న ఉద్యోగులకు సంబంధించిన మెడికల్, స్పౌజ్, మ్యూచువల్‌ బదిలీలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నవంబరు 30 వరకూ రాష్ట్రంలో కుల గణన(Caste Survey) సర్వే పూర్తి చేయాలని నిర్ణయించింది. నవంబరు 4 నుంచి 19 వరకూ 80వేల ఎన్యూమరేటర్ల సాయంతో ఇంటింటి సర్వే చేపట్టాలని అధికారులను ఆదేశించింది. ఇక ధాన్యం సేకరణకు సుమారు 6వేలకు పైగా కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపింది. హైదరాబాద్‌లో మెట్రో రైలు రెండో దశ విస్తరణ(Metro Second Phase)కు సంబంధించిన డీపీఆర్‌ను మంత్రివర్గం ఆమోదించింది.

Share post:

లేటెస్ట్