గ్రౌండ్లో పాదరసంగా మెదులుతూ అద్భుతంగా ఫీల్డింగ్ చేసే న్యూజిలాండ్ క్రికెటర్ గ్లెన్ ఫిలిప్స్ (Glenn Phillips) మరోసారి తన మాయాజాలాన్ని చూపించాడు. గాల్లో పక్షిలా ఎగురుతూ ఒంటి చేత్తో క్యాచ్ అందుకొని వావ్ అనిపించాడు. న్యూజిలాండ్ స్వదేశంలో ఇంగ్లాండ్‌తో టెస్ట్ సిరీస్ (NZ vs ENG) ఆడుతోంది. తొలి టెస్టు రెండో రోజు ఆటలో భాగంగా 77 రన్స్‌తో బ్యాటింగ్ చేస్తున్న వికెట్ కీపర్ ఒల్లీ పోప్ (Ollie Pope) షాట్ ఆడగా.. బ్యాక్‌వర్డ్ పాయింట్‌లో ఉన్న గ్లెన్ ఫిలిప్స్ కళ్లు చెదిరే క్యాచ్ అందుకున్నాడు. గాల్లో కుడి వైపునకు వంగి ఎగురుతూ ఒంటి చేత్తో అతడు పట్టిన క్యాచ్ తో పోప్ పెవిలియన్ చేరగా.. ప్లేయర్లు సంబురాల్లో మునిగిపోయారు.
మొదటి టెస్టులో టాస్ నెగ్గిన ఇంగ్లాండ్ ఫీల్డింగ్ ఎంచుకుంది. సీనియర్ ప్లేయర్ విలియమ్సన్ 93, గ్లెన్ ఫిలిప్స్ 58, కెప్టెన్ లాథమ్ మాత్రమే రాణించారు. మిగతా ప్లేయర్లు స్వల్ప స్కోర్లకే ఔటవడంతో న్యూజిలాండ్ 438 రన్స్ చేసింది. యువ ఆటగాడు బ్రైడన్ కార్సే, షోయబ్ బాషిర్ చెరో 4 వికెట్లు తీశారు. ఇంగ్లాండ్ జట్టులోని ఎస్ఆర్హెచ్ మాజీ ప్లేయర్ హ్యారీ బ్రూక్ (132 నాటౌట్) అదరగొట్టాడు. ఒల్లీ పోప్ 77, బెన్ డకెట్ 46 మంచి స్కోర్లు చేశారు. రెండో రోజు ఆట ముగిసే సమయానికి బ్రూక్‌తోపాటు కెప్టెన్ బెన్ స్టోక్స్ 37 రన్స్ తో క్రీజులో ఉన్నాడు.