గ్రౌండ్​లోనే ప్రాణాలు విడిచిన క్రికెటర్​

ఓ క్రికెటర్​ మైదానంలోనే ప్రాణాలు కోల్పోయాడు. మహారాష్ట్రలోని పుణే వేదికగా జరిగిన ఎగ్జిబిషన్​ మ్యాచ్​లో ఓ ప్లేయర్​ గ్రౌండ్​లోనే కుప్పకూలిపోయి ప్రాణాలు వదిలాడు. ఆల్​రౌండర్​ అయిన 35 ఏళ్ల ఇమ్రాన్​ పటేల్​ (Imran Patel) ఓపెనర్​గా క్రీజులోకి వచ్చాడు. కాసేపటికే ఎడమవైపు ఛాతీలో నొప్పిగా ఉందని సహచర క్రికెటర్లకు చెప్పాడు. ఆ తర్వాత అంపైర్లతో చర్చించి డగౌట్​కు వెళ్తూ కుప్పకూలిపోయాడు. అది చూసిన సహచర ఆటగాళ్లు, ప్రేక్షకులు భయపడిపోయారు. ఆ మ్యాచ్​ లైవ్​ స్ట్రీమింగ్​ జరుగుతుండడంతో వీడియోలు బయటకు వచ్చేశాయి.

అప్రమత్తమై వెంటనే ఇమ్రాన్​ పటేల్​ను ఆస్పత్రికి తరలించినా ఫలితం లేదు. అతడు అప్పటికే చనిపోయాడని డాక్టర్లు నిర్ధారించారు. తోటి క్రికెటర్​ మృతితో సహచరులంతా బాధలో మునిగిపోయారు. ఎంతో ఫిట్​గా ఉండే ఇమ్రాన్​కు ఇలా జరుగుతుందని అస్సలు ఊహించలేదని, ప్రతి మ్యాచ్​లోనూ ఎంతో యాక్టివ్​గా ఉంటాడని పేర్కొన్నారు. గతంలో ఎన్నడూ అతడు అనారోగ్య సమస్యలు ఎదుర్కోలేదన్నారు. ఆటపై ఎంతో ప్యాషన్​ ఉన్న ఇమ్రాన్​ లాంటి క్రికెటర్​ను కోల్పోవడం దిగ్భ్రాంతికి గురిచేసిందని వాపోయారు.

మృతుడు ఇమ్రాన్​కు భార్య, ముగ్గురు కుమార్తెలు, ఒక కొడుకు ఉన్నారు. బాలుడి వయసు కేవలం నాలుగు నెలలు మాత్రమే. పుణెలో ఇదే ఏడాది సెప్టెంబర్​లో హబీబ్​ షేక్​ అనే క్రికెటర్​ కూడా గ్రౌండ్​లోనే ప్రాణాలు కోల్పోయాడు. అతడికి అప్పటికే డయాబెటిస్​ సమస్య ఉంది.

Share post:

లేటెస్ట్