Mana Enadu: దేశంలో బంగారం, వెండి ధరలు(Gold, Silver Rates) ఆల్ టైమ్ హై వద్ద కొనసాగుతున్నాయి. హైదరాబాద్(Hyderabad)తో పాటు దేశంలోని వివిధ ప్రాంతాల్లోనూ దాదాపు ఇవే ధరలు ఉన్నాయి. అంతర్జాతీయ విపణి(International market)లో పెట్టుబడులు భారీగా తరలి రావడంతో ధరలకు రెక్కలొచ్చినట్లు మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 10 గ్రాముల మేలిమి బంగారం 80,500కు చేరగా.. కిలో వెండి తొలిసారిగా రూ.లక్షను అధిగమించింది. మరోవైపు అమెరికా డాలర్ విలువ(US dollar value) రూ. 84.07 పలుకుతున్నందున దేశీయంగా ఈ లోహాల ధరలు మరింత భగ్గుమన్నాయని వ్యాపారవేత్తలు అంటున్నారు.
ఆ పరిస్థితులే కారణమా..
అమెరికాలో మాంద్యం భయాలు, అధ్యక్ష ఎన్నకలు, ఇరాన్-ఇజ్రాయెల్(Iran-Israel war) మధ్య యుద్ధ వాతావరణం, ఏళ్ల తరబడి కొనసాగుతున్న రష్యా-ఉక్రెయిన్ యుద్ధం(Russia-Ukraine War) వంటి అంతర్జాతీయ సంక్షోభాలకు మార్కెట్లలో బంగారం ధరల పెరుగుదలకు మధ్య ప్రత్యక్ష సంబంధం ఉందంటున్నారు మార్కెట్ నిపుణులు(Market experts). ఆయా దేశాల మధ్య ప్రతికూలతల నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్లలో బంగారం ధరలు గరిష్ఠాలకు చేరుకుంటున్నాయని విశ్లేషిస్తున్నారు. మరోవైపు పండుగల సీజన్ కావడం, శుభకార్యాల నేపథ్యంలో బంగారం, వెండికి డిమాండ్ ఏర్పడిందంటున్నారు.
బులియన్ మార్కెట్లో సరికొత్త ధరలు
కాగా తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. హైదరాబాద్ మార్కెట్‌లో నిన్న(సోమవారం) దేశీయంగా బులియన్ ధరలు సరికొత్త ఆల్‌టైం రికార్డు నెలకొల్పాయి. ఆల్ ఇండియా సరాఫా అసోసియేషన్ డేటా(All India Sarafa Association data) ప్రకారం ఢిల్లీ మార్కెట్లో 10 గ్రాముల మేలిమి (24 క్యారెట్లు) బంగారం(Gold) ధర రూ.750 పెరిగి రూ.80,650కి చేరింది. వెండి(Silver) ధర అయితే ఏకంగా రూ.5,000 పెరిగి రూ.99,500కు చేరుకుంది. మరోవైపు AP, తెలంగాణల్లో 24 క్యారెట్ల బంగారం ధర పది గ్రాములకు రూ.220 పెరుగుదలతో రూ.79,640కి, 22 క్యారెట్ల రేటు రూ.200 పెరిగి రూ.73,000 చేరకున్నాయి. కిలో వెండి రూ.2వేలు ఎగబాకి రూ.1,09,000 ధర పలికింది.