శ్రీలంక ప్రధానిగా హరిణి అమరసూర్య ప్రమాణ స్వీకారం

Mana Enadu : శ్రీలంక నూతన అధ్యక్షుడిగా అనుర కుమార దిసనాయకే ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఆ దేశ ప్రధాని పీఠాన్ని ఓ మహిళా నేత అధిష్ఠించారు. శ్రీలంక నూతన ప్రధానిగా హరిణి అమరసూర్య (Harini Amarasuriya) మంగళవారం రోజున ప్రమాణస్వీకారం చేశారు. సిరిమావో బండారు నాయకే (1994-2000) తర్వాత శ్రీలంకలో ప్రధాని పదవి చేపట్టిన మహిళా నేత హరిణి కావడం విశేషం.

నేషనల్‌ పీపుల్స్‌ పవర్‌ (NPP)కి చెందిన 54 ఏళ్ల హరిణి అమరసూర్యతో ఆ దేశాధ్యక్షుడు అనుర కుమార దిసనాయకే (Anura Kumara Dissanayake) ఇవాళ ప్రమాణ స్వీకారం చేయించారు. ఆమెతో పాటు మరో ఇద్దరు నేతలను కేబినెట్‌ మంత్రులుగా నియమించారు. అలా తాజాగా శ్రీలంకలో దిసనాయకేతో పాటు మొత్తం నలుగురితో కూడిన కేబినెట్‌ (Sri Lanka Cabinet) కొలువుదీరింది. ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన హరిణికి న్యాయ, విద్య, కార్మిక, పరిశ్రమలు, శాస్త్ర సాంకేతిక శాఖ, ఆరోగ్యం, పెట్టుబడులు వంటి కీలక శాఖలను కేటాయించారు.

అధ్యక్ష ఎన్నికల అనంతరం అధికార మార్పిడిలో భాగంగా దినేష్ గుణవర్ధన తన ప్రధాని పదవికి నిన్న రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో తాజాగా హరిణి ప్రధాని (Sri Lanka New PM) పీఠంలో ఆసీనులయ్యారు. శ్రీలంకలో హక్కుల కార్యకర్తగా, యూనివర్శిటీ అధ్యాపకురాలిగా ఆమె గుర్తింపు పొందారు. తాజాగా పీఎంగా ప్రమాణ స్వీకారం చేసి ఆ దేశ మూడో మహిళా ప్రధానిగా రికార్డు సృష్టించారు.

ఇటీవల జరిగిన శ్రీలంక అధ్యక్ష ఎన్నికల్లో (Sri Lanka Election 2024) దిసనాయకే సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే. శ్రీలంక నూతన అధ్యక్షుడిగా ఆయన పగ్గాలు చేపట్టారు. ఇక ప్రస్తుత పార్లమెంట్‌ను రెండు రోజుల్లో రద్దు చేస్తామని ఆయన సోమవారం వెల్లడించారు. దీంతో శ్రీలంకలో ముందస్తు పార్లమెంటు ఎన్నికలు నవంబర్‌లో జరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం.

Share post:

లేటెస్ట్