హైదరాబాద్‌లో దంచికొడుతున్న వర్షం.. ఎవరూ బయటకు రావొద్దు : ఐఎండీ

ManaEnadu : పగలంతా ఎండ దంచికొడుతూ ఉక్కపోత ఊపిరాడనీకుండా చేస్తుంటే.. సాయంత్రం కాగానే వరణుడు బీభత్సం సృష్టిస్తున్నాడు. హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం (Hyderabad Rains) కురుస్తోంది. నగరంలోని సుచిత్ర, గుండ్లపోచంపల్లి, బహదూర్‌పల్లి, సూరారం, కొంపల్లి, చింతల్‌, కండ్లకోయ, కృష్ణాపూర్, దుండిగల్, గాగిల్లాపూర్, గౌడవల్లి, మునీరాబాద్, డబిల్‌పూర్‌, వనస్థలిపురం, ఎల్ బీ నగర్, కొత్తపేట, చైతన్యపురి, దిల్ సుఖ్ నగర్ ప్రాంతాల్లో ఒక్కసారిగా కురిసిన వర్షంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. భారీ వాన కురవడంతో నగరంలోని పలుచోట్ల ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. మరో గంట పాటు భారీ వర్షం కురియనున్నందున నగర ప్రజలంతా అత్యవసర పరిస్థితులైతే తప్ప బయటకు రావొద్దన వాతావరణ శాఖ (IMD Rain Alert) అధికారులు సూచించారు.

మరోవైపు రాష్ట్రంలో రానున్న 4 రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. గంటకు 40 నుంచి 50 కి.మీ, గురువారం 30 నుంచి 40 కి.మీ వేగంతో అక్కడక్కడ గాలులు వీచే అవకాశం ఉందని వెల్లడించారు. మధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఉత్తరాంధ్ర – దక్షిణ ఒడిశా తీరం వద్ద పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దాని పరిసర వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని చెప్పారు. దీని ప్రభావంతో హైదరాబాద్ తో పాటు సిద్దిపేట (Siddipet Rains), కరీంనగర్‌, కామారెడ్డి, మెదక్‌, రంగారెడ్డి, యాదాద్రి భువనగిరి, వికారాబాద్‌, సంగారెడ్డి జిల్లాల్లో వచ్చే 2-3 గంటల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని చెప్పారు.

మరోవైపు ఇవాళ యాదాద్రి ఆలయ పరిసర ప్రాంతాలతో పాటు యాదగిరిగుట్ట (Yadadri Rains)లో సుమారు 2 గంటల పాటు భారీ వర్షం కురిసింది. ఆలేరు నియోజకవర్గ వ్యాప్తంగా పలు మండలాల్లోనూ వాన పడగా, లోతట్టు ప్రాంతాల్లో వర్షపు నీరు చేరింది. కరీంనగర్‌ జిల్లాల్లోనూ భారీ వర్షం (Karimnagar Rains) కురుస్తోంది. గత వారం రోజులుగా ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న పట్టణ ప్రజలకు, ఈరోజు కురిసిన భారీ వర్షంతో ఉపశమనం లభించినట్లైంది.

 

Share post:

లేటెస్ట్