ManaEnadu:తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇల్లు లేని వారి కోసం ఇందిరమ్మ ఇళ్లు పథకం (Indiramma Housing Scheme) ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఈ పథకానికి సంబంధించి అక్టోబరు 15వ తేదీ నుంచి లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ చేపట్టనున్నారు. వారం రోజుల్లో విధివిధానాలను రూపొందించనున్నారు. మరోవైపు అక్టోబర్ 2 నుంచి అర్హులకు రేషన్ కార్డులు, హెల్త్ కార్డుల పంపిణీ ప్రక్రియ చేపట్టనున్నారు.
ఒక్కో ఏడాదికి 4.50 లక్షల ఇళ్లు నిర్మించాలని తెలంగాణ ప్రభుత్వం (Telangana Govt) నిర్ణయించింది. ఐదేళ్లలో 22.50 లక్షల ఇళ్లు నిర్మించనున్నారు. అయితే ఈ పథకానికి వచ్చిన అర్జీలే 82.82 లక్షలు ఉండటంతో దరఖాస్తుల వడపోత అధికారులకు సవాల్‌గా మారింది. ప్రభుత్వం సూచనల మేరకు ముందడుగు వేయాలని భావించారు. ఈ మేరకు వారం రోజులుగా విధివిధానాలు రూపొందించాలని రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Minister Ponguleti Srinivas Reddy) అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు పట్టణంలో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం మహబూబాబాద్ ఎంపీ బలరాంనాయక్‌తో కలిసి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
రాష్ట్రం ప్రభుత్వం పేదల సొంత ఇంటి కలను నెరవేర్చాలని ఇందిరమ్మ హౌసింగ్ స్కీమ్ (Indiramma Housing Scheme)ను ప్రారంభించినట్లు మంత్రి పొంగులేటి తెలిపారు. ఈ పథకం అమలు చేసేందుకు వివిధ రాష్ట్రాలకు గృహ నిర్మాణ పథకాల విధివిధానాలను అధ్యయనం చేసేందుకు ఓ బృందాన్ని పంపినట్లు చెప్పారు. వారు ఇచ్చిన నివేదిక ఆధారంగా ఇందిరమ్మ ఇళ్లకు లబ్ధిదారులను ఎంపిక చేయనున్నట్లు వెల్లడించారు. ఎంతో పకడ్బందీగా రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ గృహ నిర్మాణ పథకాన్ని అమలు చేయనున్నట్లు వివరించారు.