వాళ్ల వివరాలు ప్రభుత్వానికి అందజేస్తాం.. టెలిగ్రాం సీఈఓ

ManaEnadu : ప్రముఖ మెసేజింగ్‌ యాప్‌ టెలిగ్రామ్‌ (Telegram)లో నిబంధనల్ని మరింత కఠినంగా మార్చేందుకు కంపెనీ వ్యవస్థాపకుడు, సీఈఓ పావెల్‌ దురోవ్‌ (Pavel Durov) రంగం సిద్ధం చేశారు. టెలిగ్రామ్‌లో సమస్యాత్మక కంటెంట్‌ను తొలగించేందుకు కార్యాచరణ ప్రారంభించనున్నట్లు తెలిపారు. చట్టవిరుద్ధ కార్యకాలపాలకు పాల్పడే యూజర్ల వివరాలను, ఐపీ అడ్రెస్సులను ప్రభుత్వానికి అందించనున్నట్లు వెల్లడించారు. కృత్రిమ మేధస్సు (Artificial Intelligence)ను వినియోగించి తమ సిబ్బంది అలాంటి సమాచారాన్ని జల్లెడ పడుతున్నారని స్పష్టం చేశారు.

యాప్‌ దుర్వినియగాన్ని అడ్డుకోవడంలో విఫలమయ్యారనే ఆరోపణలపై ఈ ఏడాది ఆగస్టులో దురోవ్‌ ను పారిస్‌ విమానాశ్రయం(Paris Airport)లో పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. టెలిగ్రామ్‌ ద్వారా హవాలా మోసం, మాదక ద్రవ్యాల (Drugs) అక్రమ రవాణా, పిల్లలపై లైంగిక దోపిడీకి సంబంధించిన సమాచారం షేర్‌ చేయడం వంటి ఆరోపణలతో ఆయణ్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా స్నేహితులకు సందేశం పంపడం, వార్తా ఛానెల్‌లను అనుసరించడం వంటి ప్రయోజనాల కోసం టెలిగ్రామ్‌ను తీసుకొచ్చినట్లు పోలీసులతో దురోవ్‌ తెలిపారు.

చట్టవిరుద్ధమైన కార్యకలాపాలను ప్రోత్సహించేందుకు కాదని స్పష్టం చేసిన ఆయన.. ఎవరైనా సమస్యాత్మక కంటెంట్‌ యాక్సెస్‌ చేయడం లేదా షేర్‌ చేయడం లాంటివి చేస్తే చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. అటువంటి వ్యక్తుల ఫోన్‌ నంబర్లు, ఐపీ అడ్రస్‌ల(IP Address)ను సంబంధిత అధికారులకు అందజేస్తామని పేర్కొన్నారు. యాప్‌లో డ్రగ్స్‌, స్కామ్‌లు, పిల్లల దుర్వినియోగ చిత్రాలు.. వంటి సమస్యాత్మక కంటెంట్‌ను కనుగొనడం కోసం కృత్రిమ మేధస్సు (AI)ని ఉపయోగిస్తున్నట్లు దురోవ్ వివరించారు.

ఇక రష్యాలో జన్మించిన దురోవ్‌ ప్రస్తుతం దుబాయ్‌లో ఉంటున్నారు. 2021 ఆగస్టులో ఫ్రెంచ్‌ పౌరసత్వం తీసుకున్న ఆయన ప్రస్తుతం టెలిగ్రామ్ ఫౌండర్ గా ఉన్నారు. ఇటీవలే పారిస్ ఎయిర్ పోర్టులో ఆయన అరెస్టు అయ్యారు. ప్రస్తుతం టెలిగ్రామ్‌ యాప్‌ను ప్రపంచవ్యాప్తంగా సుమారు 90 కోట్లమంది వినియోగిస్తున్నారు.

Share post:

లేటెస్ట్