ManaEnadu:ప్రపంచాన్ని వణికిస్తున్న డెడ్లీ మంకీపాక్స్ (MonkeyPox) ఇప్పుడు భారత్ లోనూ చాపకింద నీరులా విస్తరిస్తోంది. తాజాగా దేశంలో మరో మంకీపాక్స్ కేసు నమోదైనట్లు సమాచారం. హెల్త్ ఎమర్జెన్సీకి దారి తీసిన ‘క్లేడ్ 1బీ’ స్ట్రెయిన్‌గా దీన్ని గుర్తించారు. కేరళకు చెందిన యువకుడిలో గతవారం ఈ వ్యాధి నిర్ధరణ అయినట్లు కేంద్ర ప్రభుత్వం (Central Govt) తెలిపింది. 2022లో ప్రపంచ ఆరోగ్య సంస్థ పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ (Health Emergency) ప్రకటించినప్పటి నుంచి భారత్‌లో 30 ఎంపాక్స్ కేసులు నమోదయ్యాయి.
క్లేడ్1బీ స్ట్రెయిన్ కేసు
ఇక తాజాగా UAE నుంచి ఇండియాకు వచ్చిన కేరళలోని మలప్పురానికి చెందిన 38 ఏళ్ల వ్యక్తిలో ఎంపాక్స్ (MPox) లక్షణాలు కనిపించడంతో వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల్లో అతడికి క్లేడ్ 1గా నిర్ధరణ అయ్యింది. ప్రపంచ ‘హెల్త్ ఎమర్జెన్సీ’కి దారితీసిన ‘క్లేడ్ 1బీ’ స్ట్రెయిన్‌గా గుర్తించిన వైద్యులు అతడిని ఐసోలేషన్ లో ఉంచారు. ప్రస్తుతం అతడి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.
మొదటి కేసు అప్పుడే
భారత్ లో సెప్టెంబర్ 9న మొదటి మంకీపాక్స్ కేసు నమోదైన విషయం తెలిసిందే. ఫారిన్ నుంచి వచ్చిన ఓ వ్యక్తి నమూనాలు పరీక్షించగా.. పశ్చిమ ఆఫ్రికా (Africa)లో వ్యాప్తిలో ఉన్న క్లేడ్-2 స్ట్రెయిన్ సోకినట్లు గుర్తించారు. దాని తీవ్రత తక్కువగా ఉండటంతో రెండు వారాల పాటు దిల్లీలోని ఎల్‌ఎన్‌జేపీ ఆసుపత్రిలో బాధితుడికి చికిత్స అందించి సెప్టెంబర్ 21న డిశ్చార్జి చేసినట్లు అధికారులు తెలిపారు.
చాపకింద నీరులా ప్రపంచవ్యాప్తం
ఇక ప్రాణాంతక మంకీపాక్స్- డెన్మార్క్(Denmark)లో పరిశోధన కోసం తెప్పించిన కోతుల్లో 1958లో మొదటి సారి వెలుగు చూడగా.. ఆ తర్వాత 1970లో మనుషుల్లో గుర్తించారు. 2005లో కాంగోలో వేల సంఖ్యలో ఈ కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత దాదాపు 12 ఏళ్ల తర్వాత 2017లో నైజీరియా సహా అనేక దేశాలకు వ్యాపించింది. మళ్లీ ఐదేళ్ల తర్వాత 2022 నుంచి చాపకింద నీరులా విస్తరిస్తూ 120 దేశాలకు పాకింది.