హైదరాబాద్‌లో ఉన్న రామోజీ ఫిల్మ్ సిటీ( Ramoji Film City) భారతదేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాతిగాంచిన సినిమా స్టూడియో. ఎన్నో సూపర్ హిట్ సినిమాల షూటింగ్‌లకు వేదికగా నిలిచిన ఈ ఫిల్మ్ సిటీ ఇప్పుడో కొత్త కారణం వల్ల హాట్ టాపిక్ అయింది. నటీమణులు, సంగీత దర్శకులు ఇలా పలువురు సెలబ్రిటీలు అక్కడ ఎదుర్కొన్న నెగెటివ్ వైబ్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.
కాజోల్(Kajol) షాకింగ్ కామెంట్స్
బాలీవుడ్ స్టార్ నటి కాజోల్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, ‘‘రామోజీ ఫిల్మ్ సిటీలో నాకు నెగటివ్ వైబ్స్ వచ్చాయి. షూటింగ్ చేస్తున్న సమయంలో చాలా భయమేసింది. ఆ ప్రదేశం నుంచి వెంటనే బయటికి వచ్చేశాను. తర్వాత ఎప్పుడూ అక్కడకు వెళ్లాలనిపించలేదు అంటూ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో దూసుకుపోతున్నాయి.
తాప్సీ(Taapsee) – “దెయ్యాలతో పోరాడలేను”
తాప్సీ గతంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, ‘‘రామోజీ ఫిల్మ్ సిటీలోని ఓ హోటల్ గదిలో బస చేసినప్పుడు, నేను ఒంటరిగా ఉన్నా కానీ ఎవరో నాతోపాటు ఉన్నట్లుగా అనిపించింది. ఎవరో నడుస్తున్న శబ్దాలు స్పష్టంగా వినిపించాయి. భయంతో వణికిపోయా. కానీ, అది నా భ్రమే అని నన్ను నేను నమ్మించుకుని నిద్రపోయే ప్రయత్నం చేశా. నేను దెయ్యాలతో పోరాడేంత బలంగా లేను’’ అంటూ చెప్పింది.
రాశీ ఖన్నా( Raashi Khanna) – “బెడ్ ఊగిపోయింది”
టాలెంటెడ్ హీరోయిన్ రాశీ ఖన్నా మాట్లాడుతూ, ‘‘నాకు కూడా రామోజీలో అదే అనుభవం. నేను బస చేసిన గదిలో నా బెడ్ దానంతటదే ఊగిపోడం, నేను కప్పుకున్న దుప్పటి ఎవరో లాగినట్లు అనిపించడం.. నాకే కాదు, అదే గదిలో ముందుగా బస చేసిన మరికొంతమంది యాక్టర్లు కూడా ఇలాంటి అనుభవాలు చెప్పినట్టు విన్నాను’’ అని వివరించింది.
ఎం.ఎం. కీరవాణి(MM Keeravani) – సంగీతంలోనూ అలజడి?
ఆస్కార్ అవార్డు విజేత, సంగీత మాంత్రికుడు ఎం.ఎం. కీరవాణి కూడా రామోజీ ఫిల్మ్ సిటీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘‘చంద్రముఖి 2 సినిమా సమయంలో సింఫనీ స్టూడియోలో లేడీ సింగర్స్ పాటలు పాడుతున్నారు. అప్పుడు వారి చెవిలో అసహజమైన శబ్దాలు వినిపించాయని వారు చెప్పారు. అంతేకాదు, ఇంటర్నెట్‌లో ‘భయానక ప్రదేశాలు’ అని సెర్చ్ చేస్తే రామోజీ ఫిల్మ్ సిటీ పేరే మొదట వస్తుంది’’ అని ఆయన అన్నారు.
నెటిజన్ల కామెంట్స్..
ఈ సెలబ్రిటీల కామెంట్లు బయటకు వచ్చిన తర్వాత, నెటిజన్లు కూడా తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ‘‘ఇంత మంది ప్రముఖులు అదే ప్రదేశంపై భయాన్ని వ్యక్తం చేస్తున్నారంటే… నిజంగానే రామోజీ ఫిల్మ్ సిటీలో ఏదో ఉంది అనిపిస్తోంది’’ అంటూ సోషల్ మీడియా వేదికగా చర్చ సాగుతోంది.






