ManaEnadu:లెబనాన్ తీవ్రవాద గ్రూపు హెజ్‌బొల్లా ఖేల్ ఖతమ్ అయింది. ఇజ్రాయెల్ వైమానిక దాడిలో హెజ్‌బొల్లా అధినేత హసన్ నస్రల్లా (Hassan Nasrallah) (64) హతమయ్యారు. ఈ విషయాన్ని ఇజ్రాయెల్ సైన్యం (IDF)తో పాటు హెజ్‌బొల్లా ధ్రువీకరించాయి. నస్రల్లా మరణానికి ప్రతీకారం తీర్చుకుంటామని, పాలస్తీనియన్లకు తమ మద్దతు కొనసాగిస్తామని హెజ్‌బొల్లా, రెసిస్టెన్స్ ఫ్రంట్ ప్రకటించాయి.
నస్రల్లా కుమార్తె మృతి
ఈ దాడుల్లోనే నస్రల్లాతో పాటు.. ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ దళానికి చెందిన డిప్యూటీ కమాండర్ జనరల్ అబ్బాస్ నీలోఫరసన్ (58), హెజ్‌బొల్లా సీనియర్ కమాండర్ అలీ కర్కి, నస్రల్లా కుమార్తె జైనబ్ నస్రల్లా కూడా చనిపోయారని ఇజ్రాయెల్ (Israel) మీడియా వెల్లడించింది. అయితే ఆమె మృతిని హెజ్‌బొల్లా ధ్రువీకరించలేదు. బీరుట్‌పై శనివారం కూడా దాడులు కొనసాగించిన ఇజ్రాయెల్ నస్రల్లాను చంపిన దాహియాలోని హెజ్‌బొల్లా ఇంటెలిజన్స్ కమాండర్ హసన్ ఖలీల్ యాసిన్‌ను మట్టుబెట్టింది.
ప్రతీకారం తీర్చుకుంటాం
నస్రల్లా మృతిపై ప్రపంచ దేశాధినేతలు స్పందించారు. ఇరాన్ సుప్రీం అధినేత (Iran Supreme Leader) అలీ ఖమేనీ స్పందిస్తూ.. ప్రపంచవ్యాప్తంగా ముస్లింలంతా లెబనాన్ ప్రజలకు, హెజ్‌బొల్లాకు అండగా నిలవాలని పిలుపునిచ్చారు. మరోవైపు నస్రల్లా మృతికి ప్రతీకారం తీర్చుకుంటామని.. పాలస్తీనాకు మద్దతుగా నిలవడంతో పాటు శత్రువుపైనా యుద్ధం కొనసాగిస్తామని హెజ్‌బొల్లా (Hezbollah) బృందం ప్రకటించింది. నస్రల్లా మృతిని ఇరాక్, రష్యా, తుర్కీయే ఖండించాయి.
నస్రల్లా హత్య సరైన చర్య
మరోవైపు నస్రల్లా హత్యను అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ (Joe Biden) సరైన చర్యగా పేర్కొన్నారు. గత ఏడాది మొదలైన యుద్ధ ప్రారంభంలోనే నస్రల్లా హత్యకు ఆపరేషన్ ప్రారంభమైందన్న బైడెన్.. నస్రల్లా ఆధ్వర్యంలో హెజ్‌బొల్లాలో వేలాది మంది అమెరికన్లు మృతి చెందారని బైడెన్ తెలిపారు. మరోవైపు బీరుట్‌లో తలెత్తిన భద్రతా పరిస్థితుల కారణంగా దౌత్యవేత్తల కుటుంబసభ్యులు, అమెరికన్ పౌరులు ఆ ప్రాంతాన్ని విడిచి వెళ్లాలని విదేశాంగ శాఖ కోరింది.