పేదలు, అనాథల కోసం నిమ్స్ ‘ప్రత్యేక సంక్షేమ నిధి’

ManaEnadu: సాధారణ కుటుంబాల్లోనే ఎవరైనా అనారోగ్యం (Health Issues) పాలైతే వారి ఆలనా పాలన చూసుకోవడానికి చాలా మంది వెనకడుగేస్తుంటారు. ఇక వృద్ధులైతే వారిని ఏకంగా వృద్ధాశ్రమాల్లోకి పంపించేస్తారు. అందరూ ఉన్న వీరి పరిస్థితే ఇలా ఉంటే.. నిరుపేదలు, ఎవరూ లేని అనాథల సంగతేంటో చెప్పనక్కర్లేదు. సాధారణ సమయాల్లోనే వీరిని పట్టించుకునే వారుండరు. అలాంటిది వీరు అనారోగ్యానికి గురైతే ఎవరు చూసుకుంటారు. దిక్కులేని వారిగా ఆ వ్యాధి పెరుగుతూ చావుకు దగ్గరవుతుంటారు. ఊహించడానికే గుండె బరువెక్కుతోంది కదూ. కానీ ఇది జగమెరిగిన సత్యం.

అందుకే ఇలాంటి వారి కోసం నిమ్స్ డైరెక్టర్ (NIMS Director) ఓ మంచి ఆలోచన చేశారు. అనారోగ్యం బారిన పడే నిరుపేదలు, అనాథలను ఆదుకునేందుకు, వారి సంరక్షణకు సంక్షేమ నిధిని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ ఆలోచనను వైద్యవర్గాలతో పాటు ప్రజలు ప్రశంసిస్తున్నారు. ఇది పూర్తిస్థాయిలో అమలైతే ఎంతో మంది ప్రాణాలు నిలబడతాయని అంటున్నారు. 

హైదరాబాద్ పంజాగుట్టలోని నిమ్స్‌ ఆస్పత్రి (NIMS Hospital)కి పేదల కార్పొరేట్‌ ఆస్పత్రిగా పేరున్న విషయం తెలిసిందే. ఇక్కడ ఎలాంటి సంక్లిష్టమైన వ్యాధి అయినా నయం అవుతుందనేది రోగుల నమ్మకం. ఇందుకోసమే ఈ ఆస్పత్రి డైరెక్టర్ నగరి బీరప్ప (NIMS Director) పేదలు, అనాథల కోసం ‘నిమ్స్‌ పేషెంట్‌ వెల్ఫేర్‌ ఫండ్‌’ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లారు. ఇటీవల నిర్వహించిన ఎగ్జిక్యూటివ్‌ బోర్డు సమావేశంలో ఆమోదించిన ఈ ప్రతిపాదనను ఆస్పత్రిలోని పలు విభాగాల్లో సంక్షేమ నిధిపై పోస్టర్‌లను అతికించారు. ఈ నిధికి సంబంధించి ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేస్తామని దాని ద్వారానే సేవలు అందుతాయని డైరెక్టర్‌ చెప్పారు. 

ఈ నిధితో అనారోగ్య సమస్యలతో సతమతమయ్యే నిరుపేదలు, అనాథలకు ప్రయోజనం చేకూరుతుందని డైరెక్టర్ బీరప్ప తెలిపారు. అలాగే ఆరోగ్య శ్రీ (Arogya Sri) లేని వారు, సీఎం రిలీఫ్ ఫండ్ తీసుకోలేని వారు, ప్రమాదవశాత్తు మృతిచెందిన వారి భౌతికకాయాలను సొంతూళ్లకు తీసుకెళ్లలేని వారికి ఈ నిధి సాయంగా నిలుస్తుందని వెల్లడించారు. ఆస్పత్రిలో బ్లాకుల వద్ద సంక్షేమ నిధి పేరుతో ఏర్పాటు చేసిన క్యూ ఆర్‌ కోడ్‌ను స్కాన్‌ చేసి ఎవరైనా రూ.1 నుంచి రూ.కోటి వరకు విరాళం ఇచ్చే అవకాశం ఉందని చెప్పారు.

Share post:

లేటెస్ట్