Mana Enadu : చెరువులు, కుంటలు, ప్రభుత్వ భూములను పరిరక్షించేందుకు ఏర్పాటైన HYDRA ఇప్పుడు సామాన్యులపైనా ఉక్కుపాదం మోపుతోంది. ఇళ్ల నిర్మాణాలకు సంబంధించి అన్ని డాక్యుమెంట్లు సక్రమంగా ఉన్నా కూల్చివేస్తున్నారంటూ బాధితులు వాపోతున్నారు. ఈ క్రమంలో తాజాగా హైడ్రా భయంతో ఓ మహిళ ఆత్మహత్య (Suicide)కు పాల్పడింది.
హైదరాబాద్ కూకట్‌పల్లి యాదవ బస్తీలో గుర్రాంపల్లి బుచ్చమ్మ అనే మహిళ ‘హైడ్రా’ భయంతో ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడింది. జలాశయాల ఎఫ్‌టీఎల్ (FTL) పరిధిలో నిర్మించిన ఇళ్లను హైడ్రా కూల్చివేస్తున్న విషయం తెలిసిందే. ఈ దంపతులు తమ కూతుళ్లకు పెళ్లి చేసి ఇళ్లను రాసిచ్చారు. ఇప్పుడు హైడ్రా ఆ ఇళ్లు కూల్చివేస్తుందనే భయంతో తల్లి బుచ్చమ్మ ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం.
అయితే ఈ ఘటనపై హైడ్రా కమిషన్ రంగనాథ్ (Ranganath) స్పందించారు. హైడ్రా ఎవరికి ఎలాంటి నోటీసులు ఇవ్వలేదని.. బుచ్చమ్మ ఆత్మహత్యపై కూకట్‌పల్లి ఇన్స్‌పెక్టర్‌తో మాట్లాడానని తెలిపారు. శివయ్య దంపతుల కూతుర్లుకు రాసిచ్చిన ఇళ్లు కూకట్‌పల్లి చెరువు (Pond)కు సమీపంలోనే ఉన్నా ఎఫ్‌టీఎల్ పరిధికి దూరంగా ఉన్నాయని తెలిపారు. కూల్చివేతల్లో భాగంగా తమ ఇళ్లను కూలుస్తారనే భయంతో వారి కూతుర్లు బుచ్చమ్మను ప్రశ్నించారని.. మనస్తాపానికి గురైన బుచ్చమ్మ ఆత్మహత్య చేసుకుందని చెప్పారు. ఈ ఘటనతో హైడ్రాకు సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు.
“హైడ్రా గురించి మీడియాలో గానీ, సామాజిక మాధ్యమాల్లోగానీ భయాలు పుట్టించవద్ద. రాష్ట్రంలో జరుగుతున్న కూల్చివేతల (Demolitions)ను హైడ్రాకు ఆపాదిస్తున్నారు. కూల్చివేతలకు సంబంధించి మూసీ పరిధిలో చేపట్టిన ఏ సర్వేలోనూ హైడ్రా భాగం కాలేదు. మూసి నదిలో భారీగా ఇళ్లను కూల్చివేయబోతున్నట్లు నకిలీ వార్తలు విపరీతంగా ప్రచారం అవుతున్నాయి. కొన్ని సోషల్ మీడియా ఛానళ్లు ప్రత్యేక ఎజెండాతో హైడ్రాపై అవాస్తవ, నకిలీ వార్తలను ప్రచారం చేస్తున్నాయి. హైడ్రా కూల్చివేతల గురించి అనవసర భయాలు వద్దు.’’ అని రంగనాథ్ పేర్కొన్నారు.