Mana Enadu : దీన్ దయాళ్ దీప్.. రేణు తన్వర్.. ఈ దంపతులు భారత సాయుధ దళాల్లో (Indian armed forces) పని చేస్తున్నారు. ఈ జంట ఒకే రోజు వేర్వేరు చోట్ల ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అయితే తన భర్తతో పాటే కలిపి తనకు దహన సంస్కారాలు చేయాలని రేణు ఆత్మహత్యకు ముందు ఓ లేఖలో రాసి మృతి చెందడం గమనార్హం. ఈ దంపతుల మృతిపై పోలీసులు కేసులు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం..
దీన్ దయాళ్ దీప్ (32) ఆగ్రా (Agra)లోని ఎయిర్‌ఫోర్స్ స్టేషన్‌లో ఐఏఎఫ్ ఫ్లైట్ లెఫ్టినెంట్‌గా (IAF officer) విధులు నిర్వహిస్తుండగా.. అదే నగరంలోని సైనిక ఆస్పత్రిలో అతడి భార్య రేణు తన్వర్ ఆర్మీలో కెప్టెన్‌గా (Army officer) పని చేస్తున్నారు. ఇటీవల రేణు తన తల్లి, సోదరుడితో కలిసి వైద్య చికిత్స కోసం దిల్లీకి (Delhi) వెళ్లారు. ఇటీవల దిల్లీ కంటోన్మెంట్ లోని అధికారుల మెస్ హాల్ లో రేణు ఆత్మహత్యకు పాల్పడ్డారు.
ఉరేసుకుని దీప్ ఆత్మహత్య
రాత్రి భోజనం తర్వాత గదిలోకి వెళ్లిన దీప్ మరుసటి రోజు బయటకు రాకపోవడంతో సహోద్యోగులు తలుపు పగలగొట్టి చూశారు. వారికి ఉరి(Suicide By Hanging)కి వేలాడుతూ దీప్ కనిపించడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే రాత్రి భోజన సమయంలో దీప్ తమతో సరదాగానే మాట్లాడారని.. సహోద్యోగులు తెలిపారు. మరోవైపు.. అదేరోజు రేణు తన్వర్ కూడా ఆత్మహత్యకు పాల్పడటం గమనార్హం.
నా భర్తతో పాటు నాకూ అంత్యక్రియలు నిర్వహించండి
కంటోన్మెంట్ అధికారుల మెస్ హాల్ లో రేణు ఆత్మహత్య(Suicide)కు పాల్పడటంతో అక్కడున్న సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. రేణు పక్కన సూసైడ్ నోట్ లభించిందని.. అందులో తన భర్త మృతదేహంతో కలిపి తనకూ దహన సంస్కారాలు నిర్వహించాలని ఆమె కోరినట్లు పోలీసులు తెలిపారు. మరోవైపు దీప్ వద్ద ఎలాంటి సూసైడ్ నోటు లభ్యం కాలేదు. దీంతో అతడి మృతిపై అనుమానం వ్యక్తం చేస్తున్న పోలీసులు ఈ ఘటనలపై దర్యాప్తు చేస్తున్నారు.