Mana Enadu : బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా (Sheikh Hasina) గత కొద్దిరోజులుగా భారత్ లో ఆశ్రయం పొందుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా ఆమెపై బంగ్లాకు చెందిన ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రైబ్యునల్ (ICT of Bangladesh) అరెస్టు వారెంట్ జారీ చేసింది. నవంబరు 18వ తేదీలోగా ఆమెను అరెస్టు చేసి తమ ఎదుట హాజరు పరచాలని ఐసీటీ చీఫ్ ప్రాసిక్యూటర్ మహమ్మద్ తజుల్ ఇస్లాం ఆదేశించారు.
బంగ్లా నుంచి భారత్ కు హసీనా
రిజర్వేషన్లపై విద్యార్థుల నిరసనలు హింసాత్మకం(Bangladesh Riots)గా మారడంతో బంగ్లాదేశ్ ప్రధానిగా ఉన్న షేక్ హసీనా పదవి నుంచి వైదొలిగిన సంగతి తెలిసిందే. ఆ అల్లర్ల సమయంలో ఆమె బంగ్లా నుంచి వచ్చి భారత్‌లో ఆశ్రయం పొందుతున్నారు. జులై 15వ తేదీ నుంచి ఆగస్టు 5వ తేదీ వరకు జరిగిన మారణహోమం(Bangladesh Violence), ఇతర నేరాల ఆరోపణలపై హసీనాకు వ్యతిరేకంగా ఐసీటీకి అందిన 60 ఫిర్యాదులపై ట్రైబ్యునల్ ఇటీవల దర్యాప్తు షురూ చేసింది.
హసీనా రావాల్సిందే
ప్రస్తుతం భారత్‌లో ఆశ్రయం పొందుతున్న ఆమెను బంగ్లాదేశ్‌కు రప్పిస్తామని ఐసీటీ నూతన ప్రాసిక్యూటర్ పేర్కొన్నారు. ఆమెపై అరెస్టు (Sheik Hasina) వారెంట్లు జారీ చేస్తామని ఆమెను స్వదేశానికి రప్పించేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ క్రమంలోనే తాజాగా ఆమెపై అరెస్టు వారెంట్ జారీ అయింది.
ఆ నిర్ణయం మీదే
హసీనా పాలనపై తీవ్ర నిరసన వ్యక్తంచేసిన విద్యార్థి సంఘాలు ఆమె భారత్‌లో ఉండటాన్ని వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే. మరోవైపు హసీనాను బంగ్లాకు రప్పించడానికి యూనస్ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆ దేశ విదేశీ వ్యవహారాల శాఖ గతంలో పేర్కొన్న విషయం తెలిసిందే. హసీనాను అప్పగించాలా, వద్దా అనే విషయంపై నిర్ణయం తీసుకోవాల్సిన బాధ్యత భారత్(India)పైనే ఉందని వ్యాఖ్యానించింది.