
సృష్టికి ప్రతి సృష్టినిచ్చి.. సమాజానికి మార్గనిర్దేశనం చేసేది మహిళ (Women). సంసార సాగరంలో ఆమెకు ఆమే సాటి.. ఓర్పుకు, నేర్పుకు, ఓదార్పునకు అమ్మగా, ఆలిగా, అక్కగా, చెల్లిగా ఆత్మీయయతో అనురాగాన్ని పంచే అమృత మూర్తీ నీకు వందనం. మహిళలు దేనిలోనూ తక్కువ కాదంటూ లింగ సమానత్వాన్ని తెలియజేస్తూ ప్రపంచవ్యాప్తంగా ఏటా మార్చి 8వ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవం(International Women’s Day) నిర్వహిస్తారు. మనిషి మనుగడకు ప్రాణం పోసే మహిళ, ఆకాశంలో సగం, అవకాశాల్లో సగం, అన్నింటా సగం అంటూ సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక, రాజకీయ విజయాలు సాధిస్తున్నారు. అయితే అసలు ఈ మహిళా దినోత్సవం ఎప్పుడు మొదలైంది? దీని చరిత్ర, ప్రాధాన్య ఏంటో ఓ లుక్ వేద్దామా..
1908లోనే అమెరికాలో..
మహిళలు స్వతంత్రంగా, ప్రతి రంగంలో సాధికారత పొందే వరకు సమాజం అభివృద్ధి చెందదని ఎంతో మంది మేధావుల అభిప్రాయం. ఏటా ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాలు మహిళల హక్కులు, సమానత్వం, వారి సహకారాన్ని గౌరవించడానికి అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటాయి. అయితే ఈ మహిళా దినోత్సవ వేడుకలు 20వ శతాబ్దంలో ప్రారంభమయ్యాయి. 1908లో, అమెరికా(America)లోని శ్రామిక మహిళలు తక్కువ వేతనాలు, ఎక్కువ పని గంటలు, ఓటు హక్కును కోరుతూ న్యూయార్క్‌లో ప్రదర్శన ఇచ్చారు. సంవత్సరం తరువాత, 1909లో సోషలిస్ట్ పార్టీ ఆఫ్ అమెరికా(Socialist Party of America) ఫిబ్రవరి 28న మొదటి జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకుంది.
మహిళా సాధికారతే ధ్యేయం
అయితే ఆ తర్వాత క్లారా జెట్కిన్(Clara Zetkin) అనే సోషలిస్ట్ నాయకురాలు మార్చి 8ని అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా ప్రకటించాలని ప్రతిపాదించింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని మొట్టమొదట 1911లో జర్మనీ, ఆస్ట్రియా, డెన్మార్క్, స్విట్జర్లాండ్‌లలో జరుపుకున్నారు. ఐక్యరాజ్యసమితి (United Nations) 1975లో మార్చి 8ను అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా అధికారికంగా ప్రకటించింది. మహిళా సాధికారత(Women Empowerment)ను ప్రోత్సహించడం లింగ సమానత్వం కోసం కృషి చేయడం మహిళల హక్కులను కాపాడటం మహిళల సామాజిక, రాజకీయ, ఆర్థిక భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడం పని ప్రదేశాలలో మహిళల విద్య, ఆరోగ్యం, వారి హక్కులను బలోపేతం చేయడం ఈ రోజు ముఖ్య ఉద్దేశం.