Mana Enadu : తమ జోలికి వస్తున్న శత్రువులను ఒక్కొక్కరిగా ఖతం చేస్తూ వస్తోంది ఇజ్రాయెల్(Israel). ఇటీవలే హమాస్ చీఫ్ యాహ్యా సిన్వర్‌ను హతం చేసిన ఇజ్రాయెల్ సైనిక బలగాలు తాజాగా హెజ్‌బొల్లా(Hezbollah)పై గురి పెట్టాయి. తాజాగా ఈ గ్రూప్ అధినేత హసన్ నస్రల్లా వారసుడైన హషీమ్ సఫీద్దీన్‌ను అంతం చేసినట్లు ఐడీఎఫ్ ధ్రువీకరించింది. హసన్ నస్రల్లా(Hassan Nasrallah) హత్య తర్వాత వారసుడిగా భావించిన అతని బంధువు హషీమ్ సఫీద్దీన్ ఇజ్రాయెల్ దాడుల్లో మృతి చెంది ఉండొచ్చని అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి.
నస్రల్లా వారసుడు హతం
అయితే తాజాగా ఈ విషయాన్ని ధ్రువీకరిస్తూ ఐడీఎఫ్ ఓ ప్రకటన జారీ చేసింది. ‘దాదాపు మూడు వారాల క్రితం జరిగిన దాడిలో హెజ్‌బొల్లా కార్యనిర్వాహక మండలి అధిపతి, జిహాద్ కౌన్సిల్లో సభ్యుడైన హషీమ్ సఫద్దీన్(Hashen Safieddine) హతమయ్యాడు. అతనితో పాటు హెజ్‌బొల్లా ఇంటెలిజెన్స్ డైరెక్టరేట్ అధిపతి అలీ హుస్సేన్ హజిమా, పలువురు హెజ్‌బొల్లా కమాండర్లు మృతి చెందారు’ అని ఐడీఎఫ్(IDF) తన ప్రకటనలో ధ్రువీకరించింది.
పక్కా సమాచారంతో దాడులు
లెబనాన్(Lebanon)లోని దాహియాలో ఓ బంకర్‌లో సీనియర్ హెజ్‌బొల్లా నేతలతో హషీమ్ సమావేశం నిర్వహించారని ఇజ్రాయెల్‌కు సమాచారం అందింది. అలా పక్కా సమాచారంతో ఐడీఎఫ్ జరిపిన దాడుల్లో లెబనీస్ గూఢాచార విభాగం అధిపతి హుస్సేన్ అలీ హజిమా, సఫీద్దీన్ మృతి చెందినట్లు అప్పట్లో అంతర్జాతీయ మీడియా కథనాలు వచ్చాయి. అయితే తాజాగా ఈ విషయాన్ని ఐడీఎఫ్ ధ్రువీకరించింది. మరోవైపు ఈ విషయంపై హెజ్‌బొల్లా ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన చేయకపోవడం గమనార్హం.