Elections : జమ్ముకశ్మీర్​ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్​ ప్రారంభం

ManaEnadu:పదేళ్ల తర్వాత జమ్ము కశ్మీర్​ (Jammu and Kashmir)లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. కేంద్ర పాలిత ప్రాంతం అయ్యాక ఇక్కడ జరుగుతున్న తొలి ఎన్నిక ఇదే. జమ్ము కశ్మీర్​లో ఇవాళ (సెప్టెంబరు 18వ తేదీ 2024) తొలి విడత అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ (J&K Assembly Elections)​ ప్రారంభమైంది. మొత్తం 90 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా, తొలి విడతలో 24 నియోజకవర్గాల్లో (కశ్మీర్​లో 16, జమ్ములో 8) పోలింగ్‌ జరుగుతోంది. 2019 ఆగస్టులో ఆర్టికల్‌ 370 రద్దైన తర్వాత జమ్ముకశ్మీర్‌లో జరుగుతున్న తొలి అసెంబ్లీ ఎన్నికలు ఇవే కావడం గమనార్హం.

24 నియోజకవర్గాల్లో పోలింగ్

త్రాల్, పాంపోర్, రాజ్‌పుర, పుల్వామా, శోపియాన్, జైనాపుర, కుల్గాం, డీహెచ్‌ పుర, దూరు, దేవ్‌సర్, అనంత్‌నాగ్‌ వెస్ట్ (Anantnag West), కోకెర్‌నాగ్, శ్రీగుఫ్వారా-బిజ్‌బెహరా, అనంత్‌నాగ్ కీలక నియోజకవర్గాల్లో తొలి విడత పోలింగ్​ (Polling)లో ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. బీజేపీ, నేషనల్‌ కాన్ఫరెన్స్‌ (NC), పీపుల్స్‌ డెమోక్రటిక్‌ పార్టీ (PDP) ప్రధానంగా ఈ ఎన్నికల బరిలోకి నిలిచాయి. ఎన్‌సీతో కాంగ్రెస్‌ జట్టు కట్టింది.

219 అభ్యర్థులు.. 23 లక్షల మంది ఓటర్లు

మొత్తం 219 అభ్యర్థులు బరిలోకి దిగుతుండగా.. 23 లక్షల మంది ఓటర్లు (Voters) తమ హక్కును ఇవాళ వినియోగించుకుంటున్నారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఓటింగ్ నిర్వహించనున్నారు. ఉగ్రదాడుల ముప్పు పొంచి ఉన్న వేళ అధికారులు జమ్ముకశ్మీర్‌లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. తొలి దశ పోలింగ్​లో జరగనున్న 24 అసెంబ్లీ స్థానాల్లో 3,276 పోలింగ్‌ స్టేషన్లు (Polling Stations) .. అర్బన్‌లో 302, గ్రామీణ ప్రాంతాల్లో 2974 పోలింగ్‌ కేంద్రాలను కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పాటు చేసింది. మొత్తం 14 వేల మంది పోలింగ్‌ సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు.

బరిలో నిలిచిన ప్రముఖులు వీళ్లే

AICC ప్రధాన కార్యదర్శి గులాం అహ్మద్ మీర్, CPMకు చెందిన మహ్మద్ యూసుఫ్ తరిగామి, నేషనల్ కాన్ఫరెన్స్‌ నుంచి చెందిన సకీనా ఇటూ, PDP నేత సర్తాజ్ మద్నీ, అబ్దుల్ రెహ్మాన్ తొలి విడతలో బరిలో నిలిచారు. ప్రాంతీయ పార్టీలు నేషనల్ కాన్ఫరెన్స్​(NC), పీపుల్స్​ డెమొక్రటిక్ పార్టీ(PDP), పీపుల్స్​ కాన్ఫరెన్స్(PC), జమ్ముకశ్మీర్ పీపుల్స్​ మూమెంట్(JKPM), ఆప్నీ, Congress, BJP ఎన్నికల బరిలో నిలిచాయి.

Share post:

లేటెస్ట్