ManaEnadu:సర్జికల్ మాస్కు, గౌనులో యుద్ధానికి సిద్ధమైన డాక్టర్లు (Doctors).. వారి సూచనలు తు.చ. తప్పకుండా పాటించే మెడికల్ స్టాఫ్.. హైఅలర్ట్‌లో ఆ గది.. బెడ్‌పైన మెదడులో కణితితో ప్రాణాలతో పోరాడుతున్న ఓ రోగి.. గది బయట ఆయన ప్రాణం నిలవాలని వేయి దేవుళ్లకు మొక్కుకుంటున్న కుటుంబ సభ్యులు. ఇలాంటి పరిస్థితుల్లో రోగి (Patient) మానసిక స్థితి ఎలా ఉంటుంది? అతడికి వైద్యం చేసి కాపాడాలనుకుంటున్న వైద్యుల మనసులో ఏం మెదులుతుంది? ఎలాంటి డైవర్షన్ లేకుండా సైలెంట్‌గా సర్జరీ చేసి ఆ రోగి ప్రాణాలు కాపాడాలి. కానీ ఆ ఆస్పత్రిలో ఏకంగా రోగికి సినిమా చూపించారు డాక్టర్లు. ఇంతకీ ఏం జరిగిందంటే?
మెలకువగా ఉండగానే సర్జరీ
కాకినాడలోని సర్వజన ఆసుపత్రి (జీజీహెచ్ (Kakinada GGH)) మంగళవారం మధ్యాహ్నం అనంతలక్ష్మి (55) అనే మహిళకు మెదడులోని కణితి తొలగింపు సర్జరీ చేశారు వైద్యులు. అయితే ఆమె మెలకువలో ఉండగానే (అవేక్ క్రేనియాటమీ) క్లిష్టమైన ఈ చికిత్సను చేసి వారు ప్రశంసలు అందుకున్నారు. మెదడు (Brain)లో ఎడమవైపు 3.3×2.7 సెం.మీ.ల పరిమాణంలో ఉన్న కణితిని అతి తక్కువ మోతాదులో మత్తు ఇచ్చి ఆమె మెలకువలో ఉండగానే శస్త్రచికిత్స ద్వారా తొలగించారు.
అదుర్స్ సినిమా చూపిస్తూ సర్జరీ
అయితే సర్జరీ చేసేటప్పుడు ఆ మహిళకు ట్యాబ్‌లో ‘అదుర్స్ (Adhurs Movie)’ సినిమా చూపించారు. ఆమె సినిమాలో బ్రహ్మీ-ఎన్టీఆర్ (NTR) కామెడీ చూస్తూ హాయిగా రిలాక్స్ అవుతుండగా నొప్పి తెలియకుండా ఈ సర్జరీ చేశారు. సర్జరీ (Brain Surgery) తర్వాత ఆమె లేచి కూర్చున్నారు. బ్రేక్‌ఫాస్ట్ కూడా చేశారు. జీజీహెచ్‌లో ఇలాంటి సర్జరీ చేయడం ఇదే మొదటి సారి అని కాకినాడ జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ లావణ్యకుమారి, న్యూరోసర్జరీ విభాగం వైద్య నిపుణులు తెలిపారు. మరో అయిదు రోజుల్లో ఆమెను డిశ్ఛార్జి చేస్తామన్నారు. దాదాపు రెండున్నర గంటలపాటు న్యూరోసర్జరీ శస్త్రచికిత్స సీనియర్ వైద్యులు, మత్తు వైద్యుల పర్యవేక్షణలో ఈ శస్త్రచికిత్స జరిగింది.