కన్నడ నటి రాన్యా రావ్ (Ranya Rao) కిచ్చా సుదీప్ హీరోగా నటించిన ‘మాణిక్య’ చిత్రంతో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత ‘వాఘా’, ‘పటాకీ’ సినిమాల్లో నటించింది. అయితే తాజగా ఈ భామ ఓ కేసులో ఇరుక్కుంది. అక్రమంగా బంగారం తీసుకొచ్చిందన్న కారణంతో ఆమెను పోలీసులు అరెస్టు చేశారు. అసలేం జరిగిందంటే..?
గోల్డ్ స్మగ్లింగ్
దుబాయ్ నుంచి రాన్యా రావ్ (Ranya Rao Arrest) అక్రమంగా 15 కిలోల బంగారం తీసుకొస్తున్నట్లు బెంగళూరు ఎయిర్ పోర్టు అధికారులకు సమాచారం అందింది. ఈ నేపథ్యంలో ఆమె విమానం దిగగానే తనిఖీలు చేయగా రాన్యా వద్ద 15 కేజీల బంగారం లభించింది. ఈ గోల్డ్ ను విమానాశ్రయంలో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (DRI) అధికారులు స్వాధీనం చేసుకున్నారు. రాన్యా ఇటీవల తరచూ దుబాయ్ వెళ్లి వస్తుండడంతో ఆమెపై నిఘా పెట్టిన అధికారులు ఎట్టకేలకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.
15 రోజుల్లో 4సార్లు
“గత 15 రోజుల్లో రాన్యా 4 సార్లు దుబాయ్ వెళ్లొచ్చింది. ఎలాంటి అనుమానం రాకుండా.. గోల్డ్ బిస్కెట్లను దుస్తుల్లో దాచి, తీసుకొచ్చింది. అయితే తరచూ దుబాయ్ వెళ్లడంతో ఆమెపై అనుమానం వచ్చింది. అందుకే ఆమెపై నిఘా పెట్టాం. ఇటీవల దుబాయ్ నుంచి రాగానే ఎయిర్ పోర్టులో ఆమెను క్షుణ్నంగా తనిఖీ చేశాం. అలా ఆమె వద్ద 15 కిలోల బంగారాన్ని సీజ్ చేశాం.” అని డీఆర్‌ఐ అధికారులు తెలిపారు.
పోలీసులతో సంబంధమేంటి?
కర్ణాటకకు చెందిన ఓ పోలీసు అధికారికి రాన్యా బంధువని తెలిసింది. డీఆర్‌ఐ అధికారులు ప్రశ్నించిన సమయంలో రాన్యా తాను డీజీపీ కుమార్తెనని చెప్పినట్లు సమాచారం. తనను ఇంటి వద్ద డ్రాప్ చేసేందుకు ఆమె పోలీసులకు కాల్ చేసినట్టు తెలిసింది. అయితే రాన్యాకు అసలు పోలీసులతో సంబంధమేంటి? గోల్డ్ స్మగ్లింగ్‌లో వారి ప్రమేయం ఏమైనా ఉందా? అన్న కోణంలో డీఆర్‌ఐ అధికారులు ఆరా తీస్తున్నారు.






