భారతదేశం అభివృద్ధి చెందిన దేశాల సరసన చేరాలంటే యువత వారానికి 70 గంటలు చొప్పున పని చేయాలంటూ ఇన్ఫోసిస్ (Infosys) సహ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి పేర్కొన్న విషయం తెలిసిందే. ఆయన కామెంట్స్ పెద్ద చర్చకు దారి తీశాయి. చాలా మంది ఈ విషయంలో ఆయనపై తీవ్రంగా ఫైర్ అయ్యారు. తాజాగా నారాయణమూర్తి బాటలోనే ఎల్ అండ్ టీ ఛైర్మన్ ఎస్‌ఎన్ సుబ్రహ్మణ్యన్ (L&T chairman SN Subrahmanyan) కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదివారాలు కూడా పని చేయాలని ఆయన ఉద్యోగులకు సూచించారు.
ఎంతకాలం భార్యను చూస్తారు
“ఎంత కాలం అని అలా భార్యను చూస్తూ ఉండిపోతారు. వారానికి 90 గంటలు పని చేయండి. అవసరమైతే సండే కూడా పని చేయాలి. ఇంట్లో తక్కువ సమయం ఉండండి. ఆఫీసులో ఎక్కువ సమయం ఉంటామని భార్యలకు చెప్పండి. ఆదివారాలు మీతో పని చేయించలేక పోతున్నందుకు బాధగా ఉంది. మీతో సండే కూడా పని చేయించగలిగితే నాకు సంతోషంగా ఉంటుంది. నేను కూడా సండే రోజున పని చేస్తున్నాను.’’ అంటూ ఉద్యోగులతో సుబ్రహ్మణ్యన్ (Subrahmanyan On Working Hours) అన్నారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.
ఒకరు 70 గంటలు.. మరొకరు 90 గంటలు
భార్య ప్రస్తావన తీసుకువస్తూ ఆయన కామెంట్స్ చేయడంపై కొందరు మండిపడుతున్నారు. 90 గంటలు పని అంటే తిండి, నిద్రకు కూడా సమయం కేటాయించొద్దేమోనంటూ మరికొందరు ఫైర్ అవుతున్నారు. ఇక గతంలో నారాయణమూర్తి (narayana murthy) ఓ పాడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ.. భారతీయ యువత చాలా కష్టపడాలని అన్నారు. అభివృద్ధి చెందిన దేశాలతో పోటీ పడాలంటే భారత్‌లోని యువత వారానికి 70 గంటల పాటు పని చేయాలని అభిప్రాయపడ్డారు.







