Mana Enadu : దమ్ము, ధైర్యంతో కూడిన పోరాటం వల్లే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) అన్నారు. రానున్న రోజుల్లోనూ మరింత దమ్ము, ధైర్యం చూపించాల్సి ఉందని తెలిపారు. పీసీసీ అధ్యక్షుడిగా తన నియామకం కార్యకర్తలకు ఎంతో గుర్తుండిపోతుందని పేర్కొన్నారు. టీపీసీసీ అధ్యక్షుడి (TPCC New Chief)గా మహేశ్ కుమార్ గౌడ్ పదవీ బాధ్యతల స్వీకరణ కార్యక్రమం ఘనంగా జరిగింది.
టీపీసీసీ చీఫ్‌గా మహేశ్ కుమార్ బాధ్యతలు
హైదరాబాద్ గన్‌పార్కులో (Dun Park)ని అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించి అక్కడి నుంచి భారీ ప్రదర్శనగా వచ్చి గాంధీభవన్‌లో మహేశ్ కుమార్ గౌడ్ పదవీ బాధ్యతలు స్వీకరించారు. పార్టీ కార్యాలయంలో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం పీసీసీ పీఠంపై ఆశీనులయ్యారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy), ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్, పార్టీ రాష్ట్ర ఇంచార్జీ దీపాదాస్ మున్షీ నేతలు పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం జరిగిన బహిరంగసభలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సహా మంత్రులు, టీపీసీసీ న్యూ చీఫ్ మాట్లాడారు.
మళ్లీ అధికారం మనదే
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో (Assembly Elections)నూ గెలిచి మరోసారి కాంగ్రెస్ అధికారంలోకి రావటం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఇప్పటివరకు జరిగిన ఎన్నికలు, విజయాలు సెమీఫైనల్స్‌గా అభివర్ణించారు. 2029లో దిల్లీ ఎర్రకోటపై పార్టీ జెండా ఎగురవేసి, రాహుల్ గాంధీ (Rahul gandhi) ప్రధాని ఐతేనే ఫైనల్స్‌లో విజయం సాధించినట్లని తెలిపారు. కాంగ్రెస్ కార్యకర్తల జోలికి ఎవరైనా వస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు.
టీపీసీసీ అధ్యక్షులుగా ఎన్నికైన శ్రీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ గారి ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొని, వారికి శుభాకాంక్షలు తెలుపుతూ ప్రసంగించిన తెలంగాణ కాంగ్రెస్ – ఏఐసీసీ ఇన్చార్జి శ్రీమతి దీపా దాస్ మున్షీ గారు.#TPCCPresident #OathCeremony pic.twitter.com/CByz0YwGfZ
— Telangana Congress (@INCTelangana) September 15, 2024
ఐకమత్యం చూసే అధికారం కట్టబెట్టారు
మరోవైపు టీపీసీసీ కొత్త చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. బీసీలకు న్యాయం చేయటంలో కాంగ్రెస్ పార్టీ ముందుంటుందని నిరూపితమైందని అన్నారు. కాంగ్రెస్‌లో ప్రజాస్వామ్య స్వేచ్ఛ ఎక్కువని, నేతలు బహిరంగంగానే విమర్శలు చేసుకున్నా సమయం వచ్చినప్పుడు పార్టీ కోసం, కార్యకర్తల కోసం ఏకమవుతారని తెలిపారు. అందరం ఏకతాటిమీదకు రావటం చూసినందునే ప్రజలు కాంగ్రెస్‌కు అధికారం కట్టబెట్టారని పునరుద్ఘాటించారు.
నాకు పీసీసీతో అది నిరూపితమైంది
“గాంధీభవన్ (Gandhi Bhavan)తో నాకు 40 ఏళ్ల అనుబంధం ఉంది. కాంగ్రెస్‌లో 1985లో ఎన్‌ఎస్‌యూఐ జిల్లా అధ్యక్షుడిగా నా ప్రస్థానం ప్రారంభమైంది. 2014లో కేసీఆర్ (KCR) సీఎం అయ్యాకే.. తెలంగాణ రాజకీయాల్లో భాష మారిపోయింది. కేసీఆర్‌కు దీటుగా సమాధానం చెప్పేందుకే రేవంత్‌రెడ్డి కూడా కాస్త గట్టిగా మాట్లాడారు. నా స్థాయికి నేను పీసీసీ అధ్యక్షుడిని అవుతానని ఎప్పుడూ అనుకోలేదు. పార్టీని నమ్ముకుంటే ఎప్పటికైనా న్యాయం జరుగుతుందని నాకు పీసీసీ పదవితో నిరూపితమైంది.” అని మహేశ్ కుమార్ గౌడ్ తెలిపారు.