చిరంజీవికి మరో మెగా కిరీటం.. ‘గిన్నిస్‌ బుక్ ఆఫ్‌ వరల్డ్’ రికార్డ్స్‌లో చోటు

ManaEnadu:టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి తన సినిమా కెరీర్​లో ఎన్నో ఎత్తు పళ్లాలు చూశారు. ఎన్నో అవార్డులు, ప్రశంసలు అందుకున్నారు. మధ్యలో సినిమాలకు పదేళ్లు దూరంగా ఉన్నా సెకండ్ ఇన్నింగ్స్​లో మరోసారి వెండితెరపైకి ఎంట్రీ ఇచ్చి యువ హీరోలకు దీటుగా పోటీనిస్తున్నారు. డ్యాన్స్, డైలాగ్ డెలివరీ, ఎమోషన్, యాక్షన్, రొమాన్స్, డ్రామా ఇలా జానర్ ఏదైనా ఆయన స్క్రీన్​పై కనిపించారంటే బాక్సాఫీస్ బద్ధలవ్వాల్సిందే. రికార్డులు తిరగరాయాల్సిందే.

గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్​లో చిరుకు చోటు

తెలుగు సినిమా ఇండస్ట్రీని ఏళ్ల తరబడి ఏలుతున్న మెగాస్టార్ చిరంజీవికి మరో అరుదైన గౌరవం లభించింది. 150కిపైగా చిత్రాల్లో నటించిన చిరంజీవికి విభిన్న ఆహార్యం, నటనకుగాను గిన్నిస్‌బుక్‌లో చోటు లభించింది. హైదరాబాద్​లోని ఓ ప్రైవేట్ హోటల్​లో ఆదివారం జరిగిన ఈ ఈవెంట్​లో గిన్నిస్ బుక్‌ రికార్డ్స్‌ ప్రతినిధి రిచర్డ్ చిరంజీవికి అవార్డు అందించారు. ఈ కార్యక్రమంలో బాలీవుడ్ స్టార్ నటుడు ఆమిర్ ఖాన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

156 సినిమాలు.. 537 పాటలు..

మోస్ట్ ప్రొలిఫిక్ ఫిల్మ్ స్టార్ ఇన్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ యాక్టర్, డాన్సర్​గా చిరంజీవిని ఈ అవార్డుకు ఎంపిక చేశారు. 156 సినిమాల్లో 537 పాటలు, 24 వేల డ్యాన్స్ మూమెంట్స్​కు ఈ పురస్కారం లభించింది. ఈ సందర్భంగా చిరు మాట్లాడుతూ.. గిన్నిస్ రికార్డ్స్​లో చోటు ఎప్పుడూ ఊహించలేదని అన్నారు. దీనికి కారకులైన దర్శక, నిర్మాతలు, సంగీత దర్శకులు, కొరియోగ్రాఫర్లు, అభిమానులకు ధన్యవాదాలు తెలిపారు. డ్యాన్స్‌పై ఉన్న ఆసక్తే నాకు ఈ అవార్డు అందించిందా అనిపిస్తోందని పేర్కొన్నారు.

అవార్డుల రారాజు

‘పునాదిరాళ్ళు’ చిత్రంతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన చిరంజీవి కెరీర్‌ ఆరంభంలో ఎన్నో సవాళ్లు, అవమానాలు ఎదుర్కొన్న విషయం తెలిసిందే. అయినా పట్టుదలతో స్టార్‌ హీరోగా ఎదిగారు. వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ తెలుగు తెరపై తన సత్తా చాటారు. 9 ఫిలింఫేర్‌, 3 నంది అవార్డులు అందుకున్నారు. 2006లో అప్పటి భారత ప్రభుత్వం పద్మభూషణ్‌ అవార్డుతో సత్కరించింది. అదే ఏడాది ఆంధ్రా విశ్వవిద్యాలయం నుంచి గౌరవ డాక్టరేట్‌, 2016లో ప్రతిష్ఠాత్మక రఘుపతి వెంకయ్య పురస్కారం లభించింది. 2022లో భారత ప్రభుత్వం నుంచి ఇండియన్‌ ఫిలిం పర్సనాలిటీ ఆఫ్‌ ది ఇయర్‌ పురస్కారం కూడా దక్కింది. 2024 జనవరిలో కేంద్ర ప్రభుత్వం ఆయనను పద్మ విభుషణ్ అవార్డుతో సత్కరించింది.

Share post:

లేటెస్ట్