
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha), యుంగ్ హీరో అక్కినేని నాగచైతన్య (Naga Chaitanya) విడాకులపై గతంలో రాష్ట్ర మంత్రి కొండా సురేఖ (Konda Surekha) వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అంతే కాకుండా ఆమె నాగార్జున కుటుంబంపైనా కాంట్రవర్సియల్ కామెంట్స్ చేశారు. ఈ నేపథ్యంలో అక్కినేని నాగార్జున మంత్రి వ్యాఖ్యలపై పరువు నష్టం కేసు వేశారు. ఈ కేసు విచారణలో భాగంగా రాష్ట్ర మంత్రి కొండా సురేఖ ఇవాళ నాంపల్లి ప్రత్యేక కోర్టు ముందు హాజరయ్యారు.
కోర్టుకు హాజరైన మంత్రి కొండా సురేఖ
నాంపల్లి స్పెషల్ కోర్టు (Nampally Special Court)లో ఈ కేసు విచారణ జరుగుతోంది. ఇవాళ స్పెషల్ జడ్జి ముందు కొండా సురేఖ వ్యక్తిగతంగా హాజరయ్యారు. అయితే గత విచారణలో ఆమె తరఫు న్యాయవాది.. సురేఖ చేసిన కామెంట్స్ తన అభిప్రాయం మాత్రమేనని, ఎవరినీ కించపరిచే ఉద్దేశం ఆమెకు లేదని కోర్టుకు తెలిపారు. ఆమె వ్యాఖ్యలు తప్పుగా అర్థం చేసుకున్నారని కోర్టులో వాదించారు.
మంత్రి ఇలా మాట్లాడతారా?
ఇక మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు తన కుటుంబాన్ని మానసికంగా గాయపరిచాయని గత విచారణలో నాగార్జున (Akkineni Nagarjuna) కోర్టుకు తెలిపారు. సోషల్ మీడియాలో ఆమె చేసిన పోస్టులతో ఈ వ్యాఖ్యలు మరింత వ్యాప్తి చెంది చర్చనీయాంశమయ్యాయని నాగ్ తరఫు న్యాయవాదికి కోర్టుకు వివరించారు. మంత్రి పదవిలో ఉన్న వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం బాధ్యతారాహిత్యం అని పేర్కొన్నారు.
కోర్టు తీర్పు ఏంటో?
ఈ వ్యవహారంలో మంత్రి సురేఖ (Minister Konda Surekha) గతంలో సోషల్ మీడియాలో క్షమాపణలు కోరినా, ఆ వ్యాఖ్యల ప్రభావం నాగార్జున కుటుంబంపై తీవ్రంగా ఉందని నాగ్ తరఫు లాయర్ కోర్టుకు తెలిపారు. అందుకే ఈ పరువు నష్టం కేసులో కఠినమైన చర్యలు తీసుకోవాలని కోరారు. మరోవైపు కొండా సురేఖ తరఫు న్యాయవాది గురుప్రీత్ సింగ్ వాదిస్తూ.. ఆమె సామాజిక పరిస్థితులపై అభిప్రాయాన్ని మాత్రమే వ్యక్తం చేశారని ఈ కేసును కొట్టివేయాలని కోర్టును అభ్యర్థించారు. ఇరుపక్షాల వాదనలు పూర్తిగా విన్న న్యాయస్థానం ఇవాళ ఎలాంటి తీర్పును వెలువరిస్తుందో చూడాలి.