Mana Enadu : తెలంగాణ వ్యాప్తంగా ఈ నెల 6వ తేదీ నుంచి సమగ్ర ఇంటింటి సర్వే (Samagra Kutumba Survey) ప్రారంభమైన విషయం తెలిసిందే. అయితే ఈ సర్వే సమయంలో ఎన్యూమరేటర్లకు కొన్ని చోట్ల చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ మహానగరంలో యజమానులు ఎన్యూమరేటర్లను దూషించడం, వివరాలు సరిగ్గా చెప్పకపోవడం వంటి ఘటనలు ఎదురవుతున్నాయి. మరోవైపు ఫ్రిజ్, ఏసీ, కారు, బైక్ ఇలాంటివి ఉన్నట్లుగా వివరాలు ఇస్తే సంక్షేమ పథకాలు ఆగిపోతాయని సోషల్ మీడియాలో ప్రచారం షురూ అయింది.
వదంతులు నమ్మొద్దు
ఈ నేపథ్యంలో ఈ పుకార్లపై రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) క్లారిటీ ఇచ్చారు. సర్వే సమాచారాన్ని రాష్ట్ర ప్రభుత్వమే గోప్యంగా సేకరిస్తోందని తెలిపారు. ఈ సమాచారంతో ఎవరికీ ఎలాంటి పథకాలు నిలిచిపోవని స్పష్టం చేశారు. అదనంగా మరిన్ని పథకాలు ఇవ్వడానికి ఈ సమాచారం ఉపయోగపడుతుందని వివరించారు. దీనిపై సోషల్ మీడియాలో ఇతర ప్లాట్ ఫామ్ లలో వస్తున్న వదంతులు నమ్మకుండా సర్వేకు సహకరించాని ప్రజలను కోరారు. ఈ సర్వేకు రాజకీయాలతో సంబంధం లేదని వెల్లడించారు.
దేశానికే దిక్సూచిగా తెలంగాణ
ఇంటింటి సమగ్ర కుటుంబ సర్వే(Family Survey)లో తెలంగాణ ప్రజలంతా భాగస్వాములు కావాలి. ఈ సర్వేతో తెలంగాణ దేశానికే దిక్సూచిగా మారనుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే 30 శాతం సర్వే జరిగింది. జీహెచ్ఎంసీ పరిధిలో 4.50 లక్షల ఇళ్లకు సర్వే పూర్తయింది. 85వేల ఎన్యూమరేటర్లు సర్వే చేస్తున్నారు. అని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు.






