ప్రధాని నరేంద్ర మోదీ(Narendra Modi Government) అధ్యక్షతన బుధవారం జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో దేశ అభివృద్ధికి దోహదపడే మూడు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వీటిలో ప్రధానంగా వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయడంపై దృష్టి సారించారు.
ధన్-ధాన్య కృషి యోజన:
కేంద్ర ప్రభుత్వం “ప్రధానమంత్రి ధన్-ధాన్య కృషి యోజన” పేరుతో కొత్త పథకానికి ఆమోదం తెలిపింది. ఈ పథకం 2025-26 నుండి ఆరు సంవత్సరాల పాటు అమలులో ఉంటుంది. దేశవ్యాప్తంగా 100 వ్యవసాయ జిల్లాలను ఎంపిక చేసి వ్యవసాయ(Farmer) విధానాలను ఆధునికీకరించడమే దీని ముఖ్య ఉద్దేశ్యం. నీతి ఆయోగ్ ఆకాంక్ష జిల్లాల మాదిరిగా ఇది వ్యవసాయం, వ్యవసాయ అనుబంధ రంగాలపై ప్రత్యేక దృష్టి సారిస్తుంది.
ఈ పథకం ద్వారా పంట ఉత్పాదకతను పెంచడం, పంట వైవిధ్యాన్ని ప్రోత్సహించడం, నిల్వ సౌకర్యాలు, నీటిపారుదల వ్యవస్థలు మెరుగుపరచడం వంటి లక్ష్యాలను సాధిస్తారు. మొత్తం 11 మంత్రిత్వ శాఖల పరిధిలోని 36 పథకాల సమన్వయంతో దీన్ని అమలు చేస్తారు. రూ. 24,000 కోట్ల వ్యయంతో ఈ కార్యక్రమం దేశంలోని 1.7 కోట్ల మంది రైతులకు లబ్ధి చేకూర్చనుంది.
పునరుత్పాదక ఇంధన పెట్టుబడులకు మద్దతు:
ఎన్‌టీపీసీ లిమిటెడ్‌కు పునరుత్పాదక ఇంధన రంగంలో రూ. 20,000 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు అనుమతి లభించింది. అలాగే ఎన్‌ఎల్‌సీ ఇండియా లిమిటెడ్‌కు రూ. 7,000 కోట్ల పెట్టుబడిని అనుమతించారు. ఈ పెట్టుబడులు గ్రీన్ ఎనర్జీ లక్ష్యాలను సాధించడంలో కీలక పాత్ర పోషించనున్నాయి. ఈ నిర్ణయాలు భారత్ వ్యవసాయ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడమే కాకుండా, పునరుత్పాదక ఇంధన వినియోగాన్ని వేగవంతం చేయనున్నాయి.






