మల్కాజిగిరి ఎంపీ (BJP) ఈటల రాజేందర్ (Eatala Rajender) హైకోర్టు (Telangana High Court)ను ఆశ్రయించారు. పోచారం పీఎస్‌లో నమోదైన ఎఫ్‌ఐఆర్‌ను కొట్టివేయాలని కోరుతూ ఆయన ఉన్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. ఇటీవల ఏకశిలానగర్‌లో స్థిరాస్తి వ్యాపారిపై చేయి చేసుకున్నారని వాచ్‌మెన్ ఫిర్యాదు చేయగా.. ఈటలపై పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. దీంతో ఈటల హైకోర్టును ఆశ్రయించారు.
ఇదీ జరిగింది..
ఇటీవల మేడ్చల్ జిల్లా పోచారం మున్సిపాలిటీలోని ఏకశిలానగర్‌లో ఎంపీ ఈటల పర్యటించారు. తమ భూములు లాక్కుంటున్నారన్న బాధితుల ఫిర్యాదుతో స్థిరాస్తి దళారిపై ఆగ్రహించిన ఎంపీ.. ఈ క్రమంలో అతనిపై చేయిచేసుకున్నారు. కొందరు దొంగ పత్రాలు సృష్టించి పేదల భూములు లాక్కుంటున్నారని ఈటల ఆరోపించారు. బ్రోకర్లకు సహకరించే అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దళారులతో పోలీసులు, అధికారులు కుమ్మక్కవుతున్నారన్న ఆయన.. పేదలు కొనుక్కున్న స్థలాలకు బీజేపీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.







