నాగచైతన్య (Naga chaitanya) ప్రస్తుతం కార్తీక్ వర్మ దండు దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే! చైతూకు ఇది 24వ సినిమా. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది. ఇటీవల ఫస్ట్ లుక్ కూడా విడుదల చేశారు. అయితే చైతన్య ఈ సినిమా చేస్తూనే తన 25వ సినిమా గురించి కూడా రంగం సిద్దం చేస్తున్నాడు. తనతో ‘మజిలీ’తో తనకు హిట్ ఇచ్చిన దర్శకుడు శివ నిర్వాణ (Shiva Nirvana) చెప్పిన కథకు చైతూ ఓకే చెప్పేశాడట. కొంతకాలంగా ఈ ఇద్దరు ఓ కథపై చర్చలు సాగిస్తున్నారు. శివ నిర్వాణ పూర్తి కథను సిద్ధం చేసి పూర్తిగా నరేట్ చేయడంతో బాగా నచ్చిన చైతూ ఈ సినిమా చేసేందుకు ఓకే చెప్పారట. తన 25వ సినిమాగా పట్టాలెక్కిస్తే బాగుంటుందని భావిస్తున్నారట. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఈ సినిమాను నిర్మించనుంది.
నాగ చైతన్య, శివ నిర్వాణ కాంబినేషన్‌లో..
నాగ చైతన్య, శివ నిర్వాణ కాంబినేషన్‌లో వచ్చిన ‘మజిలి’ హిట్ కొట్టింది. ఆ తర్వాత నానితో శివ తీసిన ‘టక్ జగదీష్’ మాత్రం ప్రేక్షకులను నిరాశపరిచింది. అప్పటి నుంచి శివ కథలపై దృష్టి పెట్టాడు. ఈసారీ తనదైన శైలిలో ఫీల్ గుడ్ ఎమోషన్‌తోపాటు కాస్త యాక్షన్ కథ రాసుకున్నాడని టాలీవుడ్లో టాక్ వినిపిస్తోంది. ఈ యేడాది చివర్లో ఈ సినిమా సెట్స్‌కి వెళ్లే అవకాశం ఉంది. ప్రస్తుతం కార్తీక్ వర్మతో తీస్తున్న షూటింగ్ శరవేగంగా సాగుతోంది. మీనాక్షి చౌదరి కథానాయికగా నటిస్తోంది. ఈ మూవీ షూటింగ్ ముగియగానే శివ నిర్వాణ సెట్లో నాగచైతన్య అడుగుపెట్టనున్నట్లు తెలుస్తోంది.






