రేషన్ కార్డుల (Ration Cards) కోసం ఎదురు చూస్తున్న వారికి రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఒకే రోజు ఏకంగా లక్ష కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేయాలని నిర్ణయించింది. మార్చి 1వ తేదీన ఈ కార్డులను పంపిణీ చేయనుంది. దీంతో పదేళ్ల తర్వాత పేదల కల నెరవేరబోతోంది. ఎమ్మెల్సీ ఎన్నికల (MLC Elections 2025) నేపథ్యంలో పలు జిల్లాల్లో ఎలక్షన్ కోడ్ అమల్లో ఉంది.
ముందుగా ఆ జిల్లాల్లో పంపిణీ
ఈ నేపథ్యంలో ఆ జిల్లాలు మినహా హైదరాబాద్ (Hyderabad), ఉమ్మడి రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల్లో కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. మిగిలిన జిల్లాల్లో మార్చి 8వ తేదీ తర్వాత వాటిని పంపిణీ చేయనుంది. జనవరి 26వ తేదీన ఎంపిక చేసిన గ్రామాల్లో 16,900 కుటుంబాలకు కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేసిన విషయం తెలిసిందే.
మరో 6 లక్షల కొత్త కార్డులు
ఇక తెలంగాణలో ప్రస్తుతం 90 లక్షల రేషన్ కార్డులకు 2.81 కోట్ల మంది లబ్ధిదారులున్నారు. ఇక తాజాగా మరో 6 లక్షల వరకు కొత్త కార్డులు జారీ అయ్యే అవకాశం ఉంది. కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు ప్రక్రియ ఇంకా కొనసాగుతోంది. అర్హులు రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకోవచ్చని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.






