
మందుబాబులకు బ్యాడ్ న్యూస్. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రెండ్రోజుల పాటు వైన్ షాపులు (Wine Shops Closed) మూతపడనున్నాయి. ఈనెల 27వ తేదీన రాష్ట్రంలో రెండు ఉపాధ్యాయ, పట్టభద్రుల నియోజకవర్గాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలు (MLC Elections 2025) జరగనున్న విషయం తెలిసిందే. ఈ ఎన్నికల ప్రచారం ఇవాళ (మంగళవారం) సాయంత్రం 4 గంటలకు ముగియనుంది. ఇక అప్పటి నుంచి సైలెన్స్ పీరియడ్ అమల్లోకి వస్తుంది. మరోవైపు 48 గంటలపాటు మద్యం షాపులు కూడా బంద్ చేయాలని ఎన్నికల సంఘం ఆదేశించింది.
ఆ జిల్లాల్లో మందు బంద్
ఈ నేపథ్యంలో ఎన్నికలు జరగనున్న ఉమ్మడి నల్లగొండ, ఖమ్మం, వరంగల్, కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల్లో వైన్ షాపులు రెండ్రోజుల పాటు మూతపడనున్నారు. మంగళవారం సాయంత్రం 4 గంటల నుంచి గురువారం సాయంత్రం 4 గంటల వరకు మద్యం దుకాణాలకు తాళం పడనుంది. రెండు రోజుల్లో సాధారణ మద్యం షాపులతోపాటు ఇతర రకాల మద్యం అమ్మకాలకు (Liquor Sales in Telangana) లైసెన్స్ పొందిన వారు కూడా అమ్మకాలు చేయడం లేదా సర్వ్ చేయడంపై ఈసీ నిషేధం విధించింది.
నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు
ఈ నిబంధనలు ఉల్లంఘిస్తే ప్రజాప్రాతినిధ్యం చట్టం 1951, ఎన్నికల నియమావళి 1961 ప్రకారం బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ఎన్నికల రిటర్నింగ్ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. మద్యం ఎక్కడ అమ్మినా చర్యలు తీసుకోవాలని ఎక్సైజ్ శాఖ అధికారులను ఈసీ ఆదేశించింది. ఇక ఫిబ్రవరి 27వ తేదీన ఎమ్మెల్సీ ఎన్నికలకు (MLC Polls 2025) పోలింగ్ జరగనుంది.