నవీపేట మండలం నాళేశ్వర్‌కు చెందిన ఆర్మూర్ మారుతి(24) చిన్ననాటి నుంచే పర్వతారోహణంపై ఆసక్తి చూపించేవాడు. తన మనస్సులోని మాటను కుటుంబ సభ్యులకు చెప్పాడు. నిరుపేద కుటుంబం బిడ్డా మనది..గుట్టలు ఎక్కాలంటే పైసలు కూడా లేవు. మనకెందుకు బిడ్డా అంటూ నచ్చజెప్పారు. కానీ లక్ష్యాన్ని సాధించేందుకు తల్లిదండ్రులను ఒప్పించాడు. కిలిమంజారో పర్వతం అధిరోహించేందుకు రూ.3లక్షల అప్పు చేసి మరి విజయం సాధించిన మారుతిని ఆదివారం గ్రామస్థులు సత్కరించారు.
ఇదీ కుటుంబం: చిన్న గంగాధర్, సరోజన దంపతులకు మారుతి, అరుణ్ సంతానం. వీరిది వ్యవసాయ కుటుంబం. తల్లి బీడీ కార్మికురాలు తమ్ముడు హైదరాబాద్‌లో ఇంజనీరింగ్ చదువుతున్నాడు. బాసర ట్రిపుల్ ఐటి ఇంజనీరింగ్ పూర్తి చేసిన మారుతి ప్రస్తుతం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు కంపెనీలో జాబ్ చేస్తున్నాడు.. ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించిన మాలవత్ పూర్ణ ఆనంద్‌ను స్ఫూర్తిగా తీసుకున్నాడు. ఏడాదికి పైగా భువనగిరి పర్వతారోహణాలపై శిక్షణ సైతం పూర్తి చేశాడు. కిలిమంజారో అధిరోహించేందుకు ఇటీవల వచ్చిన అవకాశంతో దాతలు రూ.50వేలు సాయం అందించారు. మరో రూ.3లక్షలు అప్పు చేశాడు.దక్షిణాఫ్రికాలో ఈనెల 10న వెళ్లి పర్వతం ఎక్కడం ప్రారంభించాడు. 5875 మీటర్లుఉ ఎత్తులో ఉన్న పర్వతం ఎక్కుతుండగా జ్వరం వచ్చినా వెనక్కి తగ్గకుండా లక్ష్యం దిశగా అడుగులు వేసి ఆదర్శంగా నిలిచాడు.