కలవరపెడుతోన్న కుక్కకాటు మరణాలు

Mana Enadu: రేబీస్ రక్కసి ఏటా ప్రపంచవ్యాప్తంగా దాదాపు 70వేల మంది ప్రాణాలను బలితీసుకొంటుంది. వీటిల్లో 95శాతం ఆసియా, ఆఫ్రికా ఖండాల్లోనే సంభవిస్తున్నాయి. ఒక్క భారత్‌లోనే ఏడాదికి 18 నుంచి 20వేల దాకా మరణాలు సంభవిస్తున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ విడుదల చేసిన నివేదికలో వెల్లడవుతోంది. అత్యధికంగా 15ఏళ్ల లోపు చిన్నారులే రేబీస్ బారిన పడటం తీవ్ర కలవరపెడుతోంది.

వైరస్ ఎలా వ్యాపిస్తుందంటే..

లాబ్డో కుటుంబానికి చెందిన లిస్సా అనే వైరస్ కారణంగా ఈ వ్యాధి వ్యాపిస్తుంది. ఈ వైరల్ వ్యాధి పిల్లులు, గబ్బిలాలు, కుక్కలు, గొర్రెలు, పందులు, గుర్రాల ద్వారా వస్తున్నప్పటికీ 99 శాతం శునకాల వల్లే వ్యాప్తి చెందుతుంది. వ్యాధి సోకిన కుక్క మరొక కుక్కనో, జంతువునో, మనుషులనో కరవడం ద్వారా ఇది మరింత విస్తరిస్తుంది. కేంద్ర నాడీ వ్యవస్థను వేగంగా ప్రభావితం చేయగల ఈ వ్యాధిని వెంటనే గుర్తించి సరైన చికిత్స చేయకపోతే ప్రాణాంతకం. వ్యాధి ఉన్న కుక్క కరిచినప్పుడు తక్షణ వైద్యం తీసుకోకపోతే ప్రాణానికి ప్రమాదం. అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో ఈ వైరస్ సోకడం అత్యంత అరుదు. పటిష్ఠమైన వైద్య సౌకర్యాలు ఉండటంతో అక్కడ ఏటా దీని వల్ల కనీసం 10 మరణాలు కూడా సంభవించట్లేదు.

నియంత్రణ చర్యలు కరవు..

మన దేశంలో వీధి కుక్కల సంఖ్య 6కోట్ల పైమాటే. ఇవిగాక మరో 3కోట్ల పెంపుడు కుక్కలు ఉన్నట్లు అంచనా. అయితే సంతాన నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు లేకపోవడంతో రేబీస్ మరణాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. వీధి కుక్కల నియంత్రణ చర్యలు కరవవ్వడంతో అమాయకులు విలువైన ప్రాణాలను కోల్పోవాల్సి వస్తోంది. రేబీస్ ప్రాణాంతకమైనప్పటికీ అప్రమత్తంగా ఉంటే నివారణ సాధ్యమే. కుక్క కాటుకు గురైన తర్వాత 24గంటల్లోగా రేబీస్ నిరోధక టీకా (యాంటీ రేబీస్ వ్యాక్సిన్) తీసుకుంటే సురక్షితం. అయితే ఇది వైరస్ తీవ్రతను బట్టి కాటుకు గురైన రోజు, 3వ రోజు, 7వ రోజు, 14వ రోజు, 30వ రోజు ఇలా 5 డోసుల వరకూ తీసుకోవాల్సి ఉంటుంది. అయితే అవగాహన లేక కొందరు నాటు వైద్యం దిశగా పోవడంతో, నిర్లక్ష్యంతో మరికొందరు ప్రాణాలు కోల్పోతున్నారు.

అవగాహన, అప్రమత్తత ముఖ్యం

వీధి, పెంపుడు కుక్కల సంఖ్య గణనీయంగా పెరడంతో కుక్క కాటు కేసులు భారత్‌లో అత్యధికంగా నమోదవుతున్నాయి. పసికందులను సైతం శునకాలు పీక్కుతింటున్న ఉదంతాలు ఎన్నో వెలుగుచూస్తున్నాయి. ఈ తరుణంలో కేంద్రం యాంటీ రేబీస్ వ్యాక్సిన్‌ను ఇటీవల అత్యవసర మందుల జాబితాలో చేర్చింది. దీనిపై ప్రజల్లో పూర్తి స్థాయి అవగాహన కల్పించి, దీనిని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలతో సహా అన్ని ఆసుపత్రుల్లో అందుబాటులో ఉంచాలి. అలాగే శునకాల సంతాన నియంత్రణకు పటిష్ఠ చర్యలు చేపట్టాలి. అప్పుడే ఈ మహమ్మారిని తరిమికొట్టగలం.

Share post:

లేటెస్ట్