Mana Enadu : ఏపీలో నూతన మద్యం విధానం (AP Liquor Policy) అమల్లోకి వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కొత్తగా మద్యం దుకాణాల కోసం ప్రభుత్వం దరఖాస్తులు ఆహ్వానించింది. మొదటి రోజే పెద్ద ఎత్తున అప్లికేషన్లు వచ్చినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. 200లకు పైగా వచ్చిన దరఖాస్తుల్లో ఆఫ్‌లైన్ విధానంలో స్థానిక ఎక్సైజ్ స్టేషన్లలో నేరుగా సమర్పించినవే అధికంగా ఉన్నాయని వెల్లడించాయి. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 3,396 మద్యం దుకాణాలకు లైసెన్సు (Wine Shop License)ల జారీకి ఎక్సైజ్ శాఖ సోమవారం అర్ధరాత్రి తర్వాత నోటిఫికేషన్ ఇచ్చిన సంగతి తెలిసిందే.
మాంచి కిక్కిచ్చే వార్త
ఈ క్రమంలో మందుబాబులకు మాంచి కిక్కిచ్చే ఓ వార్త తెలిసింది. ఏపీలోని నూతన మద్యం పాలసీలో భాగంగా దుకాణాల్లో మద్యం ప్రియులు మెచ్చే బ్రాండ్లు (New Liquor Brands) అందుబాటులో ఉండనున్నాయట. ముఖ్యంగా నేషనల్, మల్టీ నేషనల్ బ్రాండ్లను అందుబాటులో ఉంచనున్నారట. వినియోగదారులు కోరుకునే బ్రాండ్లన్నీ ఈ ప్రాంతాల్లో విక్రయించనున్నారు. సరఫరా కంపెనీల నుంచి మద్యం కొనుగోలు కోసం చెల్లించే బేసిక్ ప్రైస్ (మూల ధర)ను చెల్లించేందుకు హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి ఆధ్వర్యంలో కమిటీని వేయనున్న రాష్ట్ర ప్రభుత్వం.. 90 రోజుల్లోగా ఈ ప్రక్రియను పూర్తి చేయాలని నిర్ణయించింది.
లక్షకుపైగా దరఖాస్తులు
గడువు ముగిసేలోగా లక్షకు పైగా దరఖాస్తులు రావొచ్చని ఎక్సైజ్ (AP Excise Department) అధికారులు అంచనా వేస్తున్నారు. నాన్ రిఫండబుల్ దరఖాస్తు రుసుముల రూపంలోనే దాదాపు రూ.2 వేల కోట్ల ఆదాయం సమకూరుతుందంటున్నారు. ఈసారి 3,396 దుకాణాలకుగానూ ఒక్కో దానికి సగటున 30 వరకు దరఖాస్తులు రావొచ్చని చెబుతున్నారు. ఈ నెల 9వ తేదీ వరకు గడువు ఉండగా, చివరి 3 రోజుల్లో ఎక్కువ దరఖాస్తులు వచ్చే అవకాశం ఉంది.
ఆన్‌లైన్‌లో ఇలా దరఖాస్తు చేసుకోండి :
- ముందుగా hpfsproject.com వెబ్‌సైట్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.
- ఫోన్ నంబర్‌నే యూజర్ ఐడీగా పెట్టి, పాస్‌వర్డ్ క్రియేట్ చేసుకోవాలి.
- యూజర్ నేమ్, పాస్‌వర్డ్ లేదా ఓటీపీతో లాగిన్ అవ్వాలి.
- ఆ తర్వాత దరఖాస్తు ఫారమ్ లో అడిగిన వివరాలు సమర్పించి సబ్ మిట్ కొట్టాలి.