‘ఎమ్మెల్యే సాబ్.. మీకే ఓటేశాను.. నాకు పెళ్లి చేయండి’

Mana Enadu : సాధారణంగా మనం ఓటేసిన నాయకులు మళ్లీ ఎప్పుడైనా మన ఏరియాకు వస్తే.. మహా అయితే ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీల గురించి అడుగుతాం. లేదా ఆ ప్రాంతంలో ఉన్న సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్తాం. ఇంకా ఏవైనా వ్యక్తిగత సమస్యలు ఉన్నా.. కొన్నిసార్లు వాటి తీవ్రతను బట్టి సాయం కోరడం కోసం సదరు నాయకుడి వద్ద మన గోడు వెల్లబోసుకుంటాం.  కానీ ఓ వ్యక్తి  మాత్రం తమ ప్రాంతానికి వచ్చిన ఎమ్మెల్యే కనిపించగానే తన సమస్య చెప్పుకున్నాడు. ఆ సమస్య పరిష్కరించాల్సిందేనని పట్టుబట్టాడు. ఆ వ్యక్తి సమస్య విన్న ఎమ్మెల్యేతో పాటు అక్కడున్న వారంతా షాక్ అయ్యారు. ఇంతకీ ఆ సమస్య ఏంటంటే..?

ఉత్తర్‌ప్రదేశ్‌ (Uttar Pradesh)లోని చర్ఖారీ నియోజకవర్గానికి బ్రిజ్‌భూషణ్‌ రాజ్‌పుత్ (Charkhari MLA Brijbhushan Rajput) ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన ఇటీవల తన వాహనంలో వెళ్తూ మహోబా ప్రాంతంలో పెట్రోల్‌ కొట్టించుకునేందుకు ఒక బంక్ వద్ద బండిని ఆపారు. ఆ బంకులో పనిచేస్తోన్న స్థానిక వ్యక్తి అఖిలేంద్ర ఖరే..ఎమ్మెల్యేను చూసి వెంటనే ఆయన బండి వద్దకు పరిగెత్తాడు.

అఖిలేంద్ర.. ఏదైనా సాయం కోసం వస్తున్నాడేమో అని బ్రిజ్‌భూషణ్(UP MLA Viral Video) భావించి కారు ఆపారు. కానీ అఖిలేంద్ర చెప్పిన సమస్య విన్న తర్వాత ఎమ్మెల్యేతో పాటు అక్కడున్న వారంతా షాకయ్యారు.  తాను పెళ్లి చేసుకునేందుకు ఒక అమ్మాయిని చూడాలని ఎమ్మెల్యేను అడిగాడు అఖిలేంద్ర.  వారిద్దరి సంభాషణ ఇలా సాగింది.

  • అఖిలేంద్ర : ఎమ్మెల్యే సాబ్ నేను పెళ్లి చేసుకోవాలి. నాకో అమ్మాయిని వెతికి పెట్టండి
  • ఎమ్మెల్యే:  నీ వయసెంత..?
  • అఖిలేంద్ర: త్వరలో 44 వస్తాయి
  • ఎమ్మెల్యే: అయినా ఒక అమ్మాయిని చూడాలని నన్నే ఎందుకు అడుగుతున్నావు..?
  • అఖిలేంద్ర: నా ఓటు మీకే వేశా. అందుకే
  • ఎమ్మెల్యే: అయితే నేను నీకు పెళ్లి చేయాలన్నమాట. మరి ఎలాంటి అమ్మాయి కావాలేంటి..?
  • అఖిలేంద్ర : ఈ వర్గాల(కొన్ని వర్గాలకు చెందిన వారు వద్దు)కు చెందిన వారు కాకుండా ఎవరైనా ఓకే
  • ఎమ్మెల్యే : అలా ఎప్పుడూ వివక్ష చూపకూడదు. భగవంతుడు ఎవరితో రాసిపెడితే వారితోనే వివాహం జరుగుతుంది. ‘‘నీకు త్వరగా పెళ్లి కావాలని కోరుకుంటున్నా. నాకు ఓటేశావు కదా.. నా వంతు ప్రయత్నం చేస్తా.
  • ఎమ్మెల్యే : ఇంతకీ నీ జీతం ఎంత..?
  • అఖిలేంద్ర : రూ.6వేల జీతం వస్తుంది. 13బిగాల భూమి ఉంది.

ఇలా వారిద్దరి మధ్య జరిగిన సంభాషణ సాగింది.

Share post:

లేటెస్ట్