
వైఎస్సార్సీపీ (YSRCP) నేత, సినీనటుడు పోసాని కృష్ణమురళి (Posani Krishna Murali) బుధవారం రాత్రి అరెస్టయిన విషయం తెలిసిందే. ఇవాళ ఆయణ్ను పోలీసులు ఏపీలోని ఓటులవారిపల్లె ఠాణాకు తీసుకొచ్చారు. వైద్య పరీక్షలు నిర్వహించి అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ ఆధ్వర్యంలో దాదాపు 7 గంటల పాటు విచారణ సాగిస్తున్నారు.
లవ్ యూ రాజా
అయితే ఈ విచారణలో పోసాని పోలీసులకు ఏ మాత్రం సహకరించడం లేదని అధికారులు తెలిపారు. వారు ఏ ప్రశ్న అడిగినా.. తెలియదు, గుర్తులేదు, అవునా అంటూ మాట దాటవేసినట్లు వెల్లడించారు. గతంలో మీడియా సమావేశాల్లో ఆయన మాట్లాడిన వీడియోలు చూపిస్తూ ప్రశ్నించిన అధికారులతో లవ్ యు రాజా అంటూ పోసాని తన డైలాగ్ చెప్పినట్లు సమాచారం.
పోసాని అరెస్టు
ఏపీ ఉపముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై పోసాని అనుచిత వ్యాఖ్యలు చేశారని జనసేన నేత జోగినేని మణి రెండ్రోజుల క్రితం ఓబులవారిపల్లె ఠాణాలో ఫిర్యాదు ఇచ్చారు. వర్గాల మధ్య విభేదాలు రెచ్చగొట్టడం, తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయడం, వ్యవస్థీకృత నేరానికి పాల్పడడం వంటి అభియోగాలపై పోలీసులు కేసు నమోదు చేశారు. బీఎన్‌ఎస్‌లోని 196, 353(2), 111 రెడ్‌విత్ 3(5) సెక్షన్ల కేసు నమోదు చేసిన అధికారులు బుధవారం రోజున పోసానిని అరెస్టు చేసిన విషయం తెలిసిందే.