
కోలీవుడ్ టాప్ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ (Lokesh Kanagaraj) దర్శకత్వంలో సూపర్‌స్టార్ రజనీకాంత్ (Rajinikanth) కూలీ (Coolie) అనే చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. రజినీ 171 చిత్రంగా బంగారం స్మగ్లింగ్ నేపథ్యంలో భారీ బడ్జెట్‌తో సన్ పిక్చర్స్ (Sun Pictures) నిర్మిస్తోంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ అగష్టులో 14న థియేటర్లలోకి రానుంది. ఇదిలాఉంటే ఈ సినిమా విదేశీ రైట్స్ విషయంలో ఆసక్తికర విషయాలు బయటపడుతున్నాయి.
రూ.70–80 కోట్లకు విక్రయిస్తే..
కోలీవుడ్లో ‘కూలీ’ చిత్రం విదేశీ రైట్స్ ధర సరికొత్త రికార్డులను నెలకొల్పనుంది. ప్రస్తుతం విదేశీ పంపిణీ హక్కుల బిజినెస్ ప్రారంభమైన క్రమంలో ఈ మూవీ రైట్స్ సొంతం చేసుకునేందుకు ప్రముఖ సంస్థ ఏకంగా రూ.70 నుంచి రూ.80 కోట్ల మేర చెల్లించేందుకు ముందుకొచ్చిందని సమాచారం. అంత బారీ మొత్తం ఆఫర్ చేసినా అందుకు చిత్ర నిర్మాత కళానిధి మారన్ విముఖతతో ఉన్నారని, అధిక మొత్తాన్ని డిమాండ్ చేస్తున్నారని తెలుస్తోంది. ఫారిన్ రైట్స్ బిజినెస్ చర్చలు ఇంకా నడుస్తూనే ఉన్నాయని.. ఈ నెలాఖరున అన్నీ ఫైనల్ అవుతాయని సమాచారం. ఈ సినిమా హక్కులను రూ.70–80 కోట్లకు విక్రయిస్తే.. తమిళ చిత్ర పరిశ్రమలో ఈ రైట్స్ రికార్డ్స్ సృష్టిస్తాయని కోలీవుడ్ వర్గాలు పేర్కొంటున్నాయి.
సినిమాపై భారీ అంచనాలు
ఈ చిత్రంలో రజినీకాంత్ హీరోగా నటిస్తుండగా టాలీవుడ్ మన్మథుడు నాగార్జున (Nagarjuna Akkineni) మొదటిసారి విలన్ పాత్రలో నటిస్తున్నారు. ఉపేంద్ర (Upendra), షౌబిన్, సత్యరాజ్, శృతిహాసన్ (Shruti Haasan) వంటి స్టార్లు కీలక పాత్రలు పోషిస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించాడు. ఇటీవల విడుదల చేసిన గ్లిమ్స్ ఈ సినిమాపై భారీ అంచనాలు పెంచేసింది.