Mana Enadu: మనిషన్నాక కూసింత కళాపోసనుండాలి.. ఈ డైలాగ్ వినగానే ప్రతి ఒక్కరికి గుర్తొచ్చే పేరు రావు గోపాలరావు (Rao Gopal Rao). ఆయన కుమారుడిగా టాలీవుడ్‌లోకి అడుగుపెట్టారు రావు రమేశ్ (Rao Ramesh). వారసుడిగా నాలుగు పదుల వయసులో అడుగుపెట్టి క్యారెక్టర్ ఆర్టిస్టుగా మంచి పేరు తెచ్చుకున్నారు. రావు రామేశ్ ఉంటే ఎంటర్‌టైన్‌మెంట్ గ్యారంటీ అనేలా పేరు సంపాదించారు.
సాధారణంగా రావు రమేశ్ ఒక పది, పదిహేను నిమిషాలు స్క్రీన్‌పై కనిపిస్తేనే ప్రేక్షకుల్లో ఉత్సాహం కనిపిస్తుంది. అలాంటిది ఆయనే ప్రధాన పాత్రలో ఒక సినిమా చేస్తే, రెండున్నర గంటలు కథ ఆయన చుట్టూనే తిరిగితే ఊహించడానికి భలే అనిపిస్తుంది కదా. ఇలాంటి పాత్ర దొరికితే ఆయన చించేస్తారు కదా. అచ్చం అలాంటి పాత్రే ‘మారుతీనగర్ సుబ్రమణ్యం’ (Maruthi Nagar Subramanyam) అనే సినిమాతో రావు రమేశ్ తలుపు తట్టింది.
ఆయన ప్రధాన పాత్రలో ఇంద్రజ (Indraja), అంకిత్ కొయ్య, రమ్య పసుపులేటి కీలక పాత్రల్లో నటించిన మారుతీనగర్ సుబ్రమణ్యం సినిమాను లక్ష్మణ్ కార్య తెరకెక్కించారు. ఆగస్టు 23వ తేదీన విడుదలైన ఈ సినిమా థియేటర్లలో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు త్వరలో మనముందుకొస్తోంది. ఈనెల 20వ తేదీ నుంచి ప్రముఖ ఓటీటీ ‘ఆహా’ (Aha)లో మారుతీ నగర్ సుబ్రమణ్యం (Maruthi Nagar Subramanyam ott release date) సినిమా స్ట్రీమింగ్ కానుంది.
ఈ విషయాన్ని తెలియజేస్తూ ఆహా టీమ్ సోషల్ మీడియాలో పోస్టు పెట్టింది. మధ్య తరగతికి చెందిన ఓ మధ్య వయస్కుడి నిరుద్యోగ కష్టాల చుట్టూ సాగే కథతో రూపొందిన ఈ సినిమా ఆగస్టులో థియేటర్లలో విడుదలై ఆకట్టుకుంది. ప్రముఖ దర్శకుడు సుకుమార్ (Sukumar) సతీమణి తబితా ఈ చిత్రానికి సమర్పకురాలిగా వ్యవహరించారు. ఇక ఈ వీకెండ్ రోజున రావు రమేశ్ ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్‌టైనర్‌ను హాయిగా మీ కుటుంబంతో కలిసి ఆస్వాదించండి.