Mana Enadu: ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రాన్ని ఓవైపు తోడేళ్లు (wolves) వణికిస్తున్న తరుణంలో ఇప్పుడు చిరుత పులులు గజగజలాడిస్తున్నాయి. ఇప్పటికే బహరాయిచ్ జిల్లాలో తోడేళ్ల గుంపుల దాడుల్లో పదుల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. ఇక ఇప్పుడు మరో జిల్లా బిజ్నోర్‌లో తాజాగా ఓ విషయం వెలుగులోకి వచ్చింది. జనావాసాల సమీపంలో చిరుతల సంచారం, దాడుల కారణంగా ఏడాదిన్నరగా ఇక్కడి ప్రజలు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. దాదాపు 85 గ్రామాల్లో 60వేల మంది ప్రజలను చిరుతలు(Man-Eater Leopards) వణికిస్తున్నాయి.
బిజ్నోర్ సమీపంలో 500వరకు చిరుతలు (Leopards) ఉన్నాయని యూపీ అటవీ శాఖ గణాంకాలు తెలిపాయి. ఎప్పుడూ జనాలతో కళకళలాడుతూ ఉండే బిజ్నోర్‌కు చెందిన పిలానా ప్రాంతంలో ఇప్పుడు సాయంత్రం ఐదు కాగానే నిశబ్ధం ఆవహిస్తోంది. 5 గంట కొంటగానే ఇక్కడి ప్రజలు ఎంత ఎమర్జెన్సీ పని ఉన్నా అన్నీ వదిలేసి ఇళ్లకు చేరుకుంటున్నారు. తలుపు గడియలు గట్టిగా బిగించేస్తున్నారు అని ఓ జాతీయ మీడియా కథనం పేర్కొంది. ఇక్కడి దట్టమైన అడవిలో ఉండే చిరుతలు గతేడాది ఇక్కడి ప్రజలపై విరుచుకుడ్డాయని, ఆ తర్వాత ఆ దాడులు కామన్ అయిపోయాయని స్థానికులు అంటున్నారు.
బిజ్నోర్‌లోని సుమారు 85 గ్రామాలను హైపర్ సెన్సిటివ్ కేటగిరీలో (Sensitive Category)కి చేర్చారు అటవీ అధికారులు. ఇవన్నీ అటవీ ప్రాంతానికి 8 కి.మీ. నుంచి 15 కి.మీల దూరంలోనే ఉన్న ప్రాంతాలు. అయితే ఇక్కడ మ్యాన్ ఈటర్ చిరుతలను బంధించేందుకు కట్టుదిట్ట చర్యలు చేపడుతున్నా పెద్దగా ప్రయోజనాలు ఉండటం లేదని స్థానికులు చెబుతున్నారు. చిరుతలను బంధించేందుకు 107 కేజ్‌లను ఏర్పాటు చేసిన అధికారులు, పొలాలకు ఒంటరిగా వెళ్లొద్దని, ఫోన్లు, రేడియోల్లో పెద్ద శబ్దంతో పాటలు పెట్టుకోవాలని సూచించారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా దాడులు మాత్రం ఆగడం లేదు. ఆగస్టు 29న మరో వ్యక్తి మ్యాన్ ఈటర్ చిరుత దాడి(Leopard Attack)లో ప్రాణాలు కోల్పోగా.. ఏడాదిన్నర కాలంలో మృతుల సంఖ్య 25కు చేరింది.
ఇక మరోవైపు తోడేళ్ల (man-eater wolves) దాడులు ఉత్తర్‌ప్రదేశ్‌లో కలకలం సృష్టిస్తోన్న విషయం తెలిసిందే. యోగి సర్కార్ ‘ఆపరేషన్ భేడియా (Operation Bhediya)’ పేరిట వాటిని బంధిస్తోంది. అయినా వీటి దాడులు ఆగడం లేదు. తోడేళ్ల దాడుల్లో బహరాయిచ్ జిల్లాలో ఇప్పటివరకు 10 మంది ప్రాణాలు కోల్పోయారు.