Mana Enadu : ఇటీవలే కురిసిన వర్షాలు, వరదల(AP Floods) నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పూర్తిగా కోలుకోలేదు. ఇంతలోనే మరో ముప్పు పొంచి ఉందంటూ వాతావరణ శాఖ అధికారులు చేసిన ప్రకటన ఇప్పుడు ఏపీ ప్రజలను ఆందోళనకు గురి చేస్తోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రస్తుతం పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతూ తీవ్ర అల్పపీడనంగా బలపడుతోందని అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో మూడు రోజుల పాటు రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని ప్రకటించారు.
ఆ జిల్లాలకు రెడ్ అలర్ట్
దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు (AP Rains) కురవనున్నాయని వాతారవణ శాఖ అధికారులు వెల్లడించారు. ప్రకాశం, అన్నమయ్య జిల్లాల్లో భారీ వానలు పడతాయని హెచ్చరించారు. నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, కడప, అన్నమయ్య జిల్లాలకు రెడ్ అలర్ట్ (AP Rain Red Alert) జారీ చేశారు. ఈ నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తమై.. తీవ్ర వరదలు సంభవించినా.. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు చర్యలు చేపడుతున్నారు. మరోవైపు వాతావరణ హెచ్చరికల నేపథ్యంలో సీఎం చంద్రబాబు కూడా అప్రమత్తమయ్యారు.
వర్షాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
అధికారులతో సమీక్ష నిర్వహించిన సీఎం చంద్రబాబు (CM Chandrababu).. రెవెన్యూ, పోలీస్, పంచాయతీ రాజ్, నీటిపారుదల, ఆర్ ఎండ్ బీ, విద్యుత్ శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఆస్తి, ప్రాణనష్టం లేకుండా చూడాలని ఆదేశించారు. మరో రెండు రోజులు పాటు భారీవర్షాలు కురిసే అవకాశమున్న నేపథ్యంలో విద్యా సంస్థలకు సెలవు (School Holidays) ప్రకటించారు.
ఆ జిల్లాలకు వరద సహాయ నిధులు
భారీ వర్షాలు కురుస్తాయన్న హెచ్చరికలతో.. అల్పపీడన ప్రభావంతో భారీ వర్షాలు కురిసే జిల్లాల్లో ప్రభుత్వం వరద సహాయ నిధులు విడుదల చేసింది. ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, కడప జిల్లాలకు కోటి చొప్పున అత్యవసర నిధులు (AP Flood Relief Funds) సమకూర్చింది. భారీ వర్షాలు కురిసే ప్రాంతాల్లో రిలీఫ్ క్యాంపులు, రక్షిత తాగునీరు, ఆహారం, హెల్త్ క్యాంపులు, శానిటేషన్ కోసం అత్యవసర నిధులు విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ఏపీ సర్కార్.