డీఎస్సీ లేటెస్ట్ అప్​డేట్.. కాసేపట్లో టీచర్ పోస్టులకు కౌన్సెలింగ్

Mana Enadu : డీఎస్సీ-2024 (Telangana DSC 2024) ద్వారా ఉపాధ్యాయ నియామక పత్రాలు అందుకున్న కొత్త టీచర్లకు ఇవాళ (అక్టోబర్ 15వ తేదీ) ఉదయం విద్యాశాఖ షాక్ ఇచ్చింది. సాంకేతిక సమస్యల వల్ల ఇవాళ జరగాల్సిన కౌన్సెలింగ్ ప్రక్రియను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో ఇవాళ పోస్టింగ్ ఆర్డర్ (TG DSC Postings) తమ చేతిలోకి వస్తుందని ఎంతో ఆశపడిన అభ్యర్థులు తీవ్ర నిరాశకు గురయ్యారు. తదుపరి తేదీ ప్రకటన కోసం ఉదయం నుంచి కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు.

కాసేపట్లో కౌన్సెలింగ్ షురూ

వారి నిరీక్షణకు తెరదించుతూ తాజాగా విద్యాశాఖ మరో ప్రకటన జారీ చేసింది. డీఎస్సీ కౌన్సెలింగ్ (DSC Counselling) ప్రక్రియలో తలెత్తిన టెక్నికల్ సమస్య పరిష్కారమైందని తెలిపింది. ఈ నేపథ్యంలో కాసేపట్లో పోస్టింగుల ప్రక్రియ షురూ చేయనున్నట్లు ప్రకటించింది. మొత్తం 10,006 మందికి విద్యాశాఖ అధికారులు ఈ పోస్టింగులు ఇవ్వనున్నారు.  సాంకేతిక నిపుణులు సమస్య పరిష్కారం కావడంతో తిరిగి కౌన్సెలింగ్ నిర్వహించేందుకు పాఠశాల విద్యాశాఖ అనుమతినిచ్చింది.

ఇవాళే చేతిక పోస్టింగ్ ఆర్డర్

కాసేపట్లో పోస్టింగ్‌ కౌన్సెలింగ్‌ ప్రారంభం కానున్నట్లు అధికారులు తెలిపారు.  కౌన్సెలింగ్‌కు వచ్చి వెనుదిరిగిన వారికి డీఈవోలు సమాచారం అందజేస్తున్నారు. కొత్త ఉపాధ్యాయులు, ఆయా డీఈఓ(DEO)లు సూచించిన కార్యాలయాల్లో జరిగే కౌన్సెలింగ్ హాజరు కావాలని.. ఎక్కువగా కలెక్టరేట్లలోనే వీటిని నిర్వహిస్తున్నామని తెలిపారు. విద్యాశాఖ ప్రకటనతో టీచర్ అభ్యర్థులు (DSC Teacher Posts) హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎట్టకేలకు తమ పోస్టింగ్ ఆర్డర్ ఇవాళ చేతికొస్తుందని సంబుర పడుతున్నారు.

అవాక్కయ్యారు

కాగా.. షెడ్యూల్ ప్రకారం ఇవాళ ఉదయమే కౌన్సెలింగ్‌ (Telangana DSC Counselling) ప్రక్రియ జరగాలి. సాంకేతిక సమస్య ఏర్పడటంతో కౌన్సెలింగ్ వాయిదా వేశామని అధికారులు చెప్పడంతో అభ్యర్థులు ఆందోళనకు గురయ్యారు. ఒక్కరోజు ముందు కౌన్సెలింగ్‌ ఉందని సమాచారం ఇచ్చి.. తమను ఆదరబాదరాగా కౌన్సెలింగ్ కేంద్రాలకు రప్పించి..  వాయిదా వేయడంతో అవాక్కయ్యారు. ఉదయం నుంచి విద్యాశాఖ నిర్ణయం కోసం కేంద్రాల వద్దే ఎదురుచూస్తున్న వారు తాజా ప్రకటనతో హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Share post:

లేటెస్ట్