వివాదాస్పద డైరెక్టర్ రాంగోపాల్ వర్మ(Ram Gopal Varma)కు హైకోర్టులో ఊరట లభించింది. ఇటీవలే సీఐడీ అధికారులు వర్మకు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నోటీసులపై స్టే కోరుతూ ఆయన హైకోర్టును ఆశ్రయించారు. సీఐడీ నోటీసుల(CID Notice)పై స్టే విధిస్తూ.. తాజాగా న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేసింది. ఆరు వారాల వరకు తదుపరి చర్యలు నిలిపివేయాలని సీఐడీకి ఏపీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
వర్మకు హైకోర్టులో ఊరట
‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు (Kamma Rajyamlo Kadapa Redlu)’ అనే సినిమా విషయంలో రామ్ గోపాల్ వర్మపై ఏపీ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఫిర్యాదులు అందాయి. ఈ నేపథ్యంలో ఆర్జీవీని విచారణకు హాజరు కావాల్సిందిగా ఏపీ సీఐడీ నోటీసులు జారీ చేసింది. ఈ క్రమంలోనే ఈ కేసుని కొట్టివేయాలని కోరుతూ.. హైకోర్టు(AP High Court)లో డైరెక్టర్ రాంగోపాల్ వర్మ క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ తరుణంలోనే ఈ వ్యాజ్యంపై హైకోర్టు విచారణ జరిపింది. 6 వారాల వరకు తదుపరి చర్యలు తీసుకోకుండా ఉండాలని ఉత్తర్వులు జారీ చేసింది.








