Revanth Reddy: పోలీసులు చెప్పినా అల్లు అర్జున్​ వినలేదు.. అసెంబ్లీలో సీఎం రేవంత్​

సంధ్య థియేటర్‌ కు రావొద్దని అల్లు అర్జున్​కు (Allu Arjun) చెప్పినా వినకుండా వచ్చాడని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (Revanth Reddy) అన్నారు. ఈ అంశంపై శనివారం అసెంబ్లీలో ఆయన మాట్లాడారు. ఎంఐఎం నేత అక్బరుద్దీన్‌ ఒవైసీ మాట్లాడుతూ.. ఈనెల 4న ఆర్టీసీ క్రాస్‌ రోడ్‌లోని సంధ్య థియేటర్‌ వద్ద జరిగిన తొక్కిసలాటలో ఒక మహిళ చనిపోగా, బాలుడికి తీవ్ర గాయాలై కోమాలో ఉన్నాడని, అసలు ఏం జరిగిందో ప్రభుత్వం ప్రకటన చేయాలని కోరారు. ఈ అంశంపై సీఎం స్పందించి ప్రకటన చేశారు. సంధ్య థియేటర్‌కు వెళ్లేందుకు ఉన్నది ఒక్కటే దారి.. రావొద్దని పోలీసులు చెప్పినా లెక్క చేయకుండా అల్లు అర్జున్‌ వచ్చారని సీఎం వెల్లడించారు.

పెద్దగా మాట్లాడటం సరైంది కాదు..
‘‘సంధ్య థియేటర్‌ ఘటన అసెంబ్లీలో ప్రస్తావనకు వస్తుందనుకోలేదు. సభ్యులు ఈ విషయంపై ప్రస్తావించారు కాబట్టి నేను స్పందించాల్సిన అవసరం ఉంది. ఈ వ్యవహారం ప్రస్తుతం దర్యాప్తు దశలో ఉన్నందున పెద్దగా మాట్లాడటం సరైంది కాదు. ఇలా చేస్తే దర్యాప్తు అధికారి ఇబ్బందుల్లో పడే అవకాశం ఉంటుంది. డిసెంబరు 2న చిక్కడపల్లి పీఎస్‌లో సంధ్య థియేటర్‌ యాజమాన్యం దరఖాస్తు చేసింది. ‘ఈ నెల 4న పుష్ప-2 సినిమా విడుదలవుతుంది. ఆ రోజు ఈ చిత్రంలో నటించిన హీరో, హీరోయిన్‌, ప్రొడ్యూసర్‌ మరికొంత మంది సంధ్య థియేటర్‌కు వస్తున్నారు. బందోబస్తు కావాలని దరఖాస్తు చేసుకున్నారు.’ అని తెలిపారు.

పెట్టుకున్న దరఖాస్తును తిరస్కరించాం
ఆయన మాట్లాడుతూ ‘మరుసటి రోజు చిక్కడపల్లి సీఐ సంధ్య థియేటర్‌ యాజమాన్యానికి లిఖితపూర్వక సమాధానం పంపించారు. సంధ్య థియేటర్‌ పరిసరాల్లో రెస్టారంట్లు, ఇతర థియేటర్లు ఉన్నాయి. థియేటర్‌కు ఎంట్రీ, ఎగ్జిట్ ఒక్కటే ఉంది. సెలబ్రిటీలు వస్తే జనాన్ని అదుపు చేయడం కష్టంగా మారుతుంది. కాబట్టి మేం సెక్యూరిటీ ఇవ్వడం సాధ్యం కాదు. అందువల్ల హీరో, హీరోయిన్‌, ప్రొడ్యూసర్‌ ఎవరైనా థియేటర్‌కు రావడానికి అనుమతి ఇవ్వొద్దు. మీరు పెట్టుకున్న దరఖాస్తును తిరస్కరిస్తున్నాం’ అని పోలీసులు లిఖితపూర్వకంగా స్పష్టం చేశారు.

పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది
కానీ పోలీసులు అనుమతి నిరాకరించినప్పటికీ పుష్ప-2 చిత్రం ప్రీమియర్‌ షో రోజున రాత్రి 9.30 సమయంలో అల్లు అర్జున్‌ థియేటర్‌కు వచ్చారు. నేరుగా థియేటర్‌కు వచ్చి సినిమా చూసి వెళ్లిపోతే ఈ ఘటన జరిగేదో లేదో నాకు తెలియదు. ఆర్టీసీ క్రాస్‌ రోడ్డు వద్ద నుంచే తన కారులో రూఫ్‌టాప్‌ నుంచి చేతులు ఊపుతూ సంధ్య థియేటర్‌ వద్దకు చేరుకున్నారు. ఆ సమయంలో తమ అభిమాన నటుడిని చూడాలని చుట్టుపక్కల ఉన్న థియేటర్లలోని అభిమానులందరూ ఇక్కడికే వచ్చారు. హీరో కారు థియేటర్ లోపలికి పంపించేందుకు గేటు తెరిచారు. అంతే.. ఒక్కసారి వందల సంఖ్యలో అభిమానులందరూ థియేటర్‌ లోపలికి వచ్చేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో జరిగిన తొక్కిసలాటలో రేవతి చనిపోయారు. తోపులాటలో ఆమె కుమారుడికి బ్రెయిన్‌ డ్యామేజ్‌ అయింది. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఘటనపై పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది’’ అని సీఎం వివరించారు.

ఏసీపీ చెప్పినా పట్టించుకోలేదు..
‘పరిస్థితి చేయిదాటిపోయింది.. ఇక్కడి నుంచి వెళ్లిపోవాలి’ అని అల్లు అర్జున్‌కు పోలీసులు చెప్పాలని ప్రయత్నించారు. కానీ, థియేటర్‌ యాజమాన్యం అల్లు అర్జున్‌ వద్దకు వెళ్లనీయకుండా పోలీసులను బ్లాక్ చేశారు. ఎట్టకేలకు ఏసీపీ వెళ్లి అల్లు అర్జున్‌కు పరిస్థితి వివరించింది. శాంతి భద్రతల సమస్య వస్తుందని.. ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని చెప్పారు. లేదు.. లేదు.. సినిమా చూసే వెళ్తానని అల్లు అర్జున్‌ అన్నట్టు.. సిటీ కమిషనర్‌ నాతో చెప్పారు. ఎలాగో పోలీసులు బలవంతం చేసి అతన్ని థియేటర్‌ నుంచి పంపించే ఏర్పాట్లు చేసినా.. అమానవీయ వైఖరి ప్రదర్శిస్తూ మరోసారి రూఫ్‌టాప్‌ ద్వారా చేతులు ఊపుతూ వెళ్లారు. ఓ మహిళ చనిపోయింది.. ఆమె కుమారుడి పరిస్థితి విషమంగా ఉందని తెలిసినా అదే పద్ధతి కొనసాగించారు. ఈ కేసులో ఇప్పటికే అల్లు అర్జున్‌తో పాటు మరి కొంత మందిని అరెస్టు చేశారు. దర్యాప్తు కొనసాగుతోంది’ అని సీఎం పేర్కొన్నారు.

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *