Mana Enadu : పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతా ఆర్‌జీ కార్ ఆస్పత్రిలో జూనియర్ డాక్టర్ హత్యాచారానికి (Kolkata Doctor Rape and Murder) గురై నెలరోజుల పైనే అయింది. ఈ కేసుపై సీబీఐ అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అయితే తాజాగా ఈ కేసులో సీబీఐ కీలక విషయాలు వెల్లడించింది. డాక్టర్ హత్యాచార కేసులో ఆర్‌జీ కర్ వైద్య కళాశాల మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్‌తోపాటు తాలా పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జి అభిజిత్ మండల్‌ను సీబీఐ శనివారం అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.
ఆ ఇద్దరు టచ్‌లో ఉన్నారు
ఈ ఇద్దరిని ఆదివారం (సెప్టెంబరు 15వ తేదీ) స్థానిక కోర్టులో సీబీఐ (CBI) అధికారులు హాజరు పర్చారు. ఈ సందర్భంగా ఘటన వెలుగుచూసిన అనంతరం మాజీ ప్రిన్సిపల్, తాలా ఠాణా ఇంఛార్జి ఒకరితో ఒకరు టచ్‌లో ఉన్నారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ కేసులో ఎలా ముందుకెళ్లాలో మండల్‌కు సందీప్ (Sandeep Gosh) సూచనలు చేసినట్లు తెలిపారు. ఇద్దరిని మూడు రోజుల కస్టడీకి ఇవ్వాలని కోరారు.
నిజాన్ని దాచే యత్నం
ఆగస్టు 9న ఉదయం 10 గంటల ప్రాంతంలో వైద్యురాలి (Kolkata Doctor) మృతి గురించి పోలీసు అధికారికి సమాచారం అందిందని సీబీఐ కోర్టుకు వివరించింది. అయితే, రాత్రి 11 గంటల సమయంలో స్థానిక పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారని తెలిపింది. ఘోష్, మండల్‌లు కలిసి నేరాన్ని తక్కువ చేసి చూపడంతోపాటు దాన్ని కప్పిపుచ్చేందుకు యత్నించారని వెల్లడించింది. హత్యాచారం కేసు కాబట్టి దీన్ని పోలీసులు (Police) సుమోటో కేసుగా పరిగణించాల్సిందని కోర్టుకు సీబీఐ వివరించింది.
ముగ్గురు అరెస్టు
మరోవైపు ఆర్‌జీ కార్ కళాశాల (RG Kar Hospital)లో ఆర్థిక అవకతవకల కేసులో సందీప్‌ను ఇప్పటికే సీబీఐ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన జ్యుడిషియల్ కస్టడీలో ఉండగా.. తాజాగా సాక్ష్యాలను తారుమారు చేశారన్న అభియోగాలను సీబీఐ అధికారులు ఆయనపై మోపారు. మరోవైపు హత్యాచార ఘటనకు సంబంధించి ఎఫ్‌ఐఆర్ (FIR నమోదులో జాప్యం, విచారణలో సరైన సమాధానాలు చెప్పకపోవడం వంటి కారణాలతో మండల్‌ను అరెస్టు చేసినట్లు వెల్లడించారు. ఈ కేసులో ఇప్పటి వరకు ముగ్గురిని అరెస్టు చేసిని విషయం తెలిసిందే.






