Mana Enadu : విమానాశ్రయాన్ని తలపించేలా హైదరాబాద్ మహానగరంలో నిర్మించిన చర్లపల్లి రైల్వేస్టేషన్ (Cherlapally Railway Station) ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఈ స్టేషన్ అందుబాటులోకి వస్తే.. ప్రస్తుతం నగరంలో ఉన్న నాంపల్లి, సికింద్రాబాద్, కాచిగూడ్ స్టేషన్లలో రద్దీ భారం తగ్గనుంది. హైదరాబాద్‌కు తూర్పు భాగంలో చర్లపల్లి టెర్మినల్ ఉండటం.. దీనికి దగ్గర్లోనే ఘట్‌కేసర్ వద్ద ఔటర్ రింగ్ రోడ్ (ORR) కూడా ఉండటంతో ప్రయాణికులు సుదూర ప్రాంతాలకు సులభంగా ప్రయాణించ గలుగుతారని అధికారులు అంటున్నారు. ముఖ్యంగా ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చర్లపల్లి టెర్మినల్‌కు చేరుకునే వెసులుబాటు ఉంటుందని అంటున్నారు.
ఆ ప్రాంతాల్లో రహదారుల విస్తరణ
త్వరలోనే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Modi) ఈ టెర్మినల్ ను ప్రారంభించనున్నారు. సికింద్రాబాద్, హైదరాబాద్ రైల్వేస్టేషన్లపై ఒత్తిడి తగ్గించేందుకు చర్లపల్లి స్టేషన్ నుంచి రైళ్లను నడిపేందుకు అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. దీంతో చర్లపల్లి నుంచి నాగారం, దమ్మాయిగూడ, జవహర్ నగర్, కీసరతోపాటు రాజీవ్ రహదారికి వెళ్లే రోడ్లపై రద్దీ పెరగనున్నందున ఈ ప్రాంత రోడ్లను వంద అడుగులుగా విస్తరించేందుకు ఇప్పటికే మార్కింగ్ చేశారు.
ఆరు రహదారులకు రూ.254 కోట్లు
రహదారుల విస్తరణతో నాగారం(Nagaram Roads) రూపు రేఖలు మారబోతున్నాయి. రహదారులకు ఇరువైపుల ఉన్న వృక్షా లను అటవీ శాఖ అనుమతులతో అధికారులు తొలగిస్తున్నారు. సుమారు 750 వృక్షాలను గుర్తించి వాటికి మార్కింగ్ చేశారు. చర్లపల్లి టెర్మినల్ ప్రారంభమైన తర్వాత నాగారం మరింత అందంగా తయారు కాబోతోంది. హెచ్ఆర్డీసీఎల్(HRDCL) ద్వారా ఆరు రహదారులకు రూ.254 కోట్ల నిధులతో 19.50 కిలో మీటర్ల పనులు వేగవంతం చేసి ప్రజలకు రవాణా సౌకర్యం కల్పించనున్నారు.
నాగారం రూపు మారుతోంది
వంద అడుగుల దారి రోడ్డు(Roads Expansion In Nagaram) మధ్య నుంచి ఇరువైపులా, 50 అడుగుల దారి.. ఆరు అడుగులతో విభాగిని, మధ్యలో చెట్లు, వీధి దీపాలు, ఇరువైపులా ఆరు అడుగుల వాకింగ్ ట్రాక్ నిర్మాణం చేపడుతున్నట్లు హెచ్డీఆర్డీసీఎల్ డీఈ విజయ్ కుమార్ తెలిపారు. ముఖ్యంగా నాగారంలో డబుల్ బెడ్ రూమ్ ల నుంచి యంనం పేట్ వరకు 60 కిలోమీటర్లు విస్తరించనున్నట్లు చెప్పారు. దీంతో ఈ పట్టణం రూపు రేఖలు మారి మరింత అభివృద్ధి చెందనున్నట్లు వెల్లడించారు.