Mana Enadu : బిహార్లో మరోసారి కల్తీ మద్యం (Hooch Tragedy) కల్లోలం రేపింది. 27 మంది ప్రాణాలను బలి తీసుకుంది. ఇప్పటికే కల్తీ మద్యం తాగి పదుల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ విషాదం మరవకముందే మరో 27 మంది కల్తీ కల్లోలానికి ప్రాణాలు కోల్పోయారు.
కల్తీ మద్యానికి 27 మంది బలి
రాష్ట్రంలోని సివాన్, సారణ్ జిల్లాలకు చెందిన పలువురు మంగళవారం రాత్రి (అక్టోబర్ 15వ తేదీ) కల్తీ మద్యం (Adulterated Liquor) తాగి అస్వస్థతకు గురయ్యారు. అనంతరం పరిస్థితి విషమించి పలువురు మృతి చెందారు. బుధవారం నాటి (అక్టోబర్ 16వ తేదీ)కి మృతుల సంఖ్య ఆరు ఉండగా, ఇవాళ (అక్టోబర్ 17వ తేదీ) ఆ సంఖ్య 27కి చేరింది. పలువురు బాధితులకు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని.. కొందరి పరిస్థితి విషమంగా ఉందని.. ఎస్పీ శివన్ అమితేశ్ కుమార్ తెలిపారు.
ముగ్గురు అరెస్టు..
ఈ ఘటనపై దర్యాప్తు చేసేందుకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసినట్లు చాప్రా సూపరింటెండెంట్ ఆశిష్ కుమార్ వెల్లడించారు. ఇప్పటి వరకు ముగ్గురిని అరెస్టు (Bihar Hooch Case) చేశామని తెలిపారు. ఎనిమిది మందిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశామన్న ఆశిశ్ కుమార్ .. మస్రాక్ పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌ఓ నుంచి వివరణ కోరామని.. భగవాన్‌పుర్ ఎస్హెచ్ఓతోపాటు ఎఎస్‌ఐపై చట్టపరమైన చర్యలు తీసుకున్నామని తెలిపారు.
ప్రభుత్వంపై ప్రతిపక్షాలు ఫైర్
ఈ ఘటనపై ప్రతిపక్షాలు తీవ్రంగా స్పందించాయి. రాష్ట్రంలో నిషేధం (Liquor Ban in Bihar) ఉండగా కల్తీ మద్యం ఎలా అందుబాటులోకి వచ్చిందని ప్రతిపక్ష ఆర్‌జేడీ ప్రభుత్వాన్ని నిలదీసింది. అనేక మంది ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని వాపోయారు. లిక్కర్ మాఫియాకు రాష్ట్ర ప్రభుత్వ అండదండలు ఉన్నాయని తీవ్ర ఆరోపణలు చేశారు.