
నాగర్ కర్నూల్ జిల్లా శ్రీశైలం ఎడమగట్టు కాలువ (SLBC) సొరంగ మార్గంలో ప్రమాదవశాత్తు చిక్కుకున్న వారి జాడ ఇంకా కానరావడం లేదు. ఇప్పటికే ఒకరి మృతదేహాన్ని రెస్క్యూ బృందం వెలికితీసింది. మరో ఏడుగురి జాడ కోసం 18వ రోజు సహాయ చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. అయితే టన్నెల్ నుంచి దుర్వాసన వస్తోందని రెస్క్యూ బృందం వెల్లడించింది.
దుర్వాసన వస్తున్నా
ప్రమాదం జరిగిన ప్రాంతం నుంచి 50 మీటర్ల వెలుపల మనుషులు వెళ్లలేని ప్రాంతాల్లో బురదను తవ్వి కన్వేయర్ బెల్టు ద్వారా బయటకు పంపేందుకు అటానమస్ హైడ్రాలిక్ పవర్డ్ రోబో (Hydraulic Powered Robo)ను టన్నెల్‌లోకి పంపారు. డీ-2, డీ-1 మధ్య 12 మీటర్ల పొడవున్న ప్రాంతంలో అన్నిరకాల శిథిలాలు, శకలాలు తొలగిస్తే గల్లంతైనవారి జాడ దొరికే అవకాశం ఉందని చెప్పారు. టన్నెల్ లో దుర్వాసన వస్తున్నా.. అది ఎక్కడ నుంచి వస్తుందో తెలియకపోవడంతో ఇంకా శోధన సాగుతోంది.
రోబోల సాయంతో రెస్క్యూ ఆపరేషన్
మరోవైపు సహాయక చర్యల్లో భాగంగా రెస్క్యూ బృందాలు (SLBC Rescue Operation) రోబోల సాయం తీసుకుంటున్నాయి. మృతదేహాలు ఉన్నట్లుగా భావిస్తున్న ప్రాంతం డీ-2లో తవ్వకాలు ముమ్మరం చేసినట్లు అధికారులు తెలిపారు. క్యాడవర్ డాగ్స్ సూచించిన చోట్ల తవ్వకాలు జరిపినా ఎలాంటి ఆచూకీ లభ్యం కాలేదని వెల్లడించారు. అయితే అక్కడ మరింత తవ్వకాలు జరిపితే పైకప్పు కుప్పకూలే ప్రమాదం ఉన్నందున ప్రత్యేకంగా తెప్పించిన టైగర్ టింబర్తో రెండు చోట్ల కాగ్స్ని ఏర్పాటు చేసినట్లు చెప్పారు.