
భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్ (Sunita Williams) ఇప్పట్లో భూమ్మీదకు వచ్చే దాఖలాలు కనిపించడం లేదు. మూడోసారి అంతరిక్షంలోకి వెళ్లిన ఆమె దాదాపు తొమ్మిది నెలలుగా అంతరిక్ష కేంద్రంలోనే చిక్కుకుపోయిన విషయం తెలిసిందే. ఆమెతో పాటు వెళ్లిన బచ్ విల్మోర్ (Butch Wilmore) కూడా అక్కడే చిక్కుకున్నారు.
క్రూ 10 మిషన్ వాయిదా
అయితే వారిని భూమిపైకి తిరిగి తీసుకొచ్చేందుకు నాసా (NASA)-స్పేస్ ఎక్స్ (Space X)లు ప్రయోగించిన క్రూ 10 మిషన్ వాయిదా పడటంతో సునీత రాక మరింత ఆలస్యం కానుంది. అమెరికాలోని ఫ్లోరిడా నుంచి నలుగురు వ్యోమగాములతో ఫాల్కన్ 9 రాకెట్ బయలు దేరేందుకు రెడీ అయిన క్రూ 10 మిషన్ లోని హైడ్రాలిక్ సిస్టమ్‌లో సమస్య రావడంతో ఈ ప్రయోగాన్ని నిలిపివేశారు. ఈ సమస్యను పరిష్కరించి ఈ వారంలో మరో ప్రయోగం చేస్తామని నాసా వెల్లడించింది.
వ్యోమగాములు లేకుండానే
గతేడాది జూన్ 5వ తేదీన ప్రయోగించిన బోయింగ్ వ్యోమనౌక ‘స్టార్‌లైనర్’లో ఈ ఇద్దరు వ్యోమగాములు ఐఎస్‌ఎస్ (ISS)కు చేరుకున్నారు. అయితే వారు వారం రోజులకే భూమిని చేరుకోవాల్సి ఉండగా.. స్టార్‌లైనర్‌లో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో వ్యోమగాములు లేకుండానే అది భూమ్మీదకు వచ్చేసింది. ఇక అప్పటి నుంచి సునీతా, విల్మోర్ స్పేస్ లోనే ఉంటున్నారు. వారిని తిరిగి తీసుకురావడానికి నాసా (NASA) స్పేస్‌ఎక్స్‌తో కలిసి పని చేస్తోంది.